క్యాసినో కాయిన్స్‌‌‌‌తో పేకాట

  • మెదక్‌‌‌‌ జిల్లా ఏడుపాయలలోని రెస్ట్​హోంపై పోలీసుల దాడి
  • 11 మంది అరెస్ట్, రూ.12 లక్షల విలువైన కాయిన్స్‌‌‌‌ స్వాధీనం

కొల్చారం, వెలుగు : క్యాసినో కాయిన్స్‌‌‌‌తో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేసి, రూ. 12 లక్షల విలువైన కాయిన్స్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మెదక్‌‌‌‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌‌‌‌ వెల్లడించారు. మెదక్‌‌‌‌ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్‌‌‌‌పల్లి శివార్లలో ఏడుపాయల ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న శ్రీవన దుర్గ రెస్ట్‌‌‌‌ హోంలో శనివారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల టైంలో కొల్చారం ఎస్సై మహ్మద్‌‌‌‌ గౌస్‌‌‌‌ ఆధ్వర్యంలో పోలీసులు రెస్ట్‌‌‌‌ హోంపై దాడి చేశారు. 

హైదరాబాద్‌‌‌‌లోని జగద్గిరిగుట్టకు చెందిన నూకవరపు హరిబాబు, వనస్థలిపురానికి చెందిన మన్నె శ్రీనివాస్‌‌‌‌రావు, కుత్బుల్లాపూర్‌‌‌‌కు చెందిన మంతెన వాసు, షాపూర్‌‌‌‌ రాంరెడ్డి నగర్‌‌‌‌కు చెందిన కావలి శివకుమార్, హయత్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన రేకూరి శ్రీనివాసరావు, మెదక్​ జిల్లా నర్సాపూర్‌‌‌‌ శ్రీరాంనగర్‌‌‌‌ కాలనీకి చెందిన కొదిళ్ల ఆంజనేయులు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన తాళ్లపల్లి మల్లయ్య, మంచిర్యాల రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన  కొల్లిపాక సంతోష్‌‌‌‌, సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలం నర్సన్నపేటకు చెందిన  మాచారెడ్డి నారాయణరెడ్డి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన గుర్రాల అశోక్​, సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వకు చెందిన రొయ్యపల్లి గోపాల్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. 

వారి వద్ద నుంచి రూ.49,190తో పాటు రూ.12 లక్షల విలువైన క్యాసినో కాయిన్స్‌‌‌‌, 10 మొబైల్స్‌‌‌‌, క్యాష్‌‌‌‌ కౌంటింగ్‌‌‌‌ మెషీన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న హైదరాబాద్‌‌‌‌కు చెందిన వెంకట్‌‌‌‌రెడ్డి, సంతోష్‌‌‌‌ సింగ్‌‌‌‌, రెస్ట్‌‌‌‌ హోం యజమాని సాయ గౌడ్‌‌‌‌ పరారీలో ఉన్నారని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో మెదక్‌‌‌‌ రూరల్‌‌‌‌ సీఐ రాజశేఖర్‌‌‌‌రెడ్డి, కొల్చారం ఎస్సై మహ్మద్‌‌‌‌గౌస్‌‌‌‌ ఉన్నారు.