న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కార్లు కొనాలనుకునే వారికి ఒక బాడ్ న్యూస్. కార్ల కంపెనీలన్నీ రేట్లు భారీగా పెంచాలని చూస్తున్నాయి. స్టీలు, అల్యూమినియం, కరెంటు వంటి ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఈ అదనపు భారాన్ని కస్టమర్లపైనే మోపాలని ఆటోమొబైల్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. దేశంలోని పెద్ద కార్ల తయారీదారయిన మారుతి సుజుకి సహా కార్ల కంపెనీలు తమ ప్రొడక్టుల రేట్లు పెంచనున్నట్లు ప్రకటిస్తున్నాయి. పెరుగుదల జనవరి నెల నుంచి అమలులోకి వస్తుందని చెబుతున్నాయి. అన్ని వేరియంట్ల రేట్లు పెరుగుతాయని మారుతి సుజుకితోపాటు లగ్జరీ కార్ల కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, ఆడి వెల్లడించాయి. పెంపుదల అన్ని మోడల్స్కూ ఒకేలా ఉండదని ఒక్కో మోడల్‌పై ఒక్కోలా ఉంటుందని ఆ కంపెనీలు ప్రకటించాయి. రా మెటీరియల్స్ రేట్లు పెరగడంతో ధర పెంచడం తప్పనిసరవుతోందని ఈ ఆటోమొబైల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. మారుతి సుజుకి తన ఆల్టో మోడల్‌ను రూ. 3.15 లక్షలకు అమ్ముతోంది. ఇదే టైములో ఎస్యూవీ ఎస్–క్రాస్ రేటు రూ. 12.56 లక్షలు (ఢిల్లీలో ఎక్స్‌షోరూమ్ రేట్లివి). మారుతి సుజుకి 2021లో ఇప్పటికే మూడు సార్లు పెంచింది. ఈ ఏడాది జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో మరోసారి 1.9 శాతం చొప్పున మారుతి కార్ల రేట్లు పెరిగాయి. అంటే, మొత్తం పెరుగుదల 4.9 శాతమన్నమాట. ప్రొడక్షన్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలన్నీ చేసినా కుదరడం లేదని, అందుకే రేట్లు పెంచుతున్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు.
స్టీలు రేటు రెట్టింపైంది...
స్టీలు రేట్లు 2020 ఏప్రిల్–మే నెలల్లో కిలోకు రూ. 38 గా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్–మే నాటికి ఆ రేటు ఏకంగా రూ. 77 కి చేరింది. అంతేకాదు, ఇప్పట్లో స్టీలు రేట్లు దిగొచ్చే అవకాశాలు కూడా కనబడటం లేదని శ్రీవాస్తవ చెప్పారు. చైనాలో అల్యూమినియం ప్రొడక్షన్ తగ్గిపోయిందని, ఫలితంగా టన్ను రేటు 2700–2800 డాలర్లకు పెరిగిపోయిందని పేర్కొన్నారు. అంతకు మునుపు ఈ రేటు 1700–1800 డాలర్ల వద్ద ఉండేదన్నారు. కాపర్ సహా మరి కొన్ని మెటల్స్ రేట్లు చుక్కలంటుతున్నందున రేట్లు పెంచడం తప్పడం లేదని శ్రీవాస్తవ చెప్పారు. ఏ మోడల్ రేటు ఎంత పెంచాలనే విషయంలో ఇంకా కసరత్తు పూర్తవలేదని పేర్కొన్నారు. పెరుగుదల భారీగానే ఉంటుందనే సూచనలు ఇచ్చారు.
ఈకోపై రూ.8 వేల వరకు పెరుగుదల మిగిలిన మోడల్స్‌పై పెంపుదల గురించి వెల్లడించకపోయినా, ఈకోపై రూ. 8 వేల దాకా అదనపు మోత ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. అన్ని కార్లకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులను అమర్చడం తప్పనిసరి కావడంతో ఈ ఏడాది నవంబర్ నుంచి ఈకో కార్ మోడల్స్ (అన్ని నాన్ కార్గో వేరియెంట్లు) ధరలు రూ.ఎనిమిది వేల వరకు పెరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లోనూ ఇన్ పుట్ ఖర్చుల కారణంగా అన్ని మోడల్స్ ధరలను కంపెనీ పెంచింది. మారుతీ అమ్మకాలు నవంబరులో ఏడాదిప్రాతిపదికన 9.16 శాతం పడిపోయి 1,39,184 యూనిట్లుగా రికార్డయ్యాయి.
ఆడి కార్లు 3 శాతం పెరుగుతాయ్...
జనవరి 2022 నుంచి తమ కార్ల రేట్లను 3 శాతం పెంచనున్నట్లు జర్మనీ కంపెనీ ఆడి ప్రకటించింది. అన్ని మోడల్స్‌పైనా పెంపుదల వర్తిస్తుందని వెల్లడించింది. రా మెటీరియల్స్, ఆపరేషనల్ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని ఆడి పేర్కొంది. ఏ–4, ఏ–8, క్యూ–2, క్యూ–5, క్యూ–8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్7, ఈ–ట్రాన్ 55 వంటి మోడల్స్‌ను మన దేశంలో ఆడి కంపెనీ అమ్ముతోంది. సస్టెయినబుల్ బిజినెస్ మోడల్‌పై ఫోకస్‌తోనే ఈ రేట్ల పెంపుదల తప్పనిసరని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. పెంపుదల వీలయినంత తక్కువగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2021 లో ఆడి 5 ఎలక్ట్రిక్ కార్లతో సహా మొత్తం 9 కొత్త కార్లను మన మార్కెట్లో ప్రవేశపెట్టింది.
