నవ్వులే నవ్వులు.. రోహిత్‌ను పరుగులు పెట్టించిన అభిమానులు

హీరోహీరోయిన్లు కంటపడితేనే సెల్ఫీల కోసం వారిని హింసించి నానా పాట్లు పడేలా చేసే అభిమానం మనది. అలాంటిది దేశానికి అర్హత వహించే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కళ్లముందు కనపడితే ఊరుకుంటారా..! అస్సలు ఊరుకోరు. ఎగబడిపోతారు. బుధవారం(అక్టోబర్ 09) ముంబైలో అదే జరిగింది. 

ప్రాక్టీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్థానిక పార్క్‌కు విచ్చేశాడని తెలుసుకున్న అభిమానులు సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి చొచ్చుకెళ్లారు. హిట్‌మ్యాన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారిని బాధపెట్టడం ఇష్టం లేక మొదట సరేనన్న రోహిత్.. వారి సెల్ఫీల పిచ్చి తట్టుకోలేక పార్క్ నుంచి బయటకు పరుగులు తీశాడు.

దుబాయ్ పర్యటన ముంగించుకొని స్వదేశానికి చేరుకున్న రోహిత్ బుధవారం ప్రాక్టీస్ కోసం స్థానిక రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌ కు విచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున పార్క్ వద్దకు చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేక చేతులెత్తేయడంతో అభిమానులంతా ఒక్కసారిగా మైదానంలోకి చొచ్చుకెళ్లారు. రోహిత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కాసేపు వారి ఫోటోలకు పోజులిచ్చిన హిట్‫మ్యాన్.. అనంతరం ఒక్కసారిగా అక్కడినుంచి పరుగులు తీశాడు. అయినప్పటికీ, అభిమానులు అతన్ని వదల్లేదు. వెంటబడ్డారు. ఎలాగోలా అక్కడినుంచి బయటపడ్డ భారత కెప్టెన్ తన లంబోర్గిని కారులో ఇంటికి పయనమయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..