ఈ ఏడాది ఐపీఓలకు కలిసిరాలే!

ఈ ఏడాది ఐపీఓలకు కలిసిరాలే!

10 రెట్లు కంటే ఎక్కువ సబ్‌స్క్రయిబ్‌ అయినవి పద్నాలుగే

న్యూఢిల్లీ: ఈ ఏడాది  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మార్కెట్‌‌‌‌లో జోరు కనిపించలేదు.  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్‌‌గా వడ్డీ రేట్లు పెరగడం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్లోడౌన్ కావడం..ఇలా వివిధ కారణాల వలన మొదటి ఆరు నెలల్లో ఐపీఓకి  రావడానికి కంపెనీలు వెనకడుగేశాయి. సెకెండ్‌‌ హాఫ్‌‌లో కొంత ఊరట కలిగినా, టెక్‌‌ షేర్ల పతనం, ఐపీఓలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ తగ్గడంతో ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ) డల్‌‌గా కదిలింది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఓల ద్వారా కంపెనీ సేకరించిన ఫండ్స్ సగానికి పడిపోయాయి. ఈ ఏడాది రూ.57 వేల కోట్లను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీలు సేకరించాయి. ఇందులో కూడా ఒక్క ఎల్‌‌ఐసీ ఐపీఓ సైజ్‌‌ రూ. 20,557 కోట్లు కలిసి ఉంది. దీన్ని పక్కన పెడితే ఐపీఓల ద్వారా సేకరించిన ఫండ్స్ ఇంకా తక్కువగా ఉండేవి.  ‘వచ్చే ఏడాది కూడా ఐపీఓ మార్కెట్‌‌కు ఇబ్బందులు తప్పువు. గ్లోబల్‌‌ ఎకానమీ గ్రోత్ 2023 లో  నెమ్మదించనుంది. ఈ ప్రభావం ఇండియాపై కూడా పడుతుంది. వచ్చే ఏడాది ఐపీఓ మార్కెట్ డల్‌‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2022 తో పోలిస్తే 2023 లో ఐపీఓల ద్వారా సేకరించిన ఫండ్స్ మరింత తక్కువగా ఉంటాయి’ అని జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ పేర్కొన్నారు. 

ఇక భారీ వాల్యుయేషన్లు ఉండవు..

వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్ వోలటాలిటీలో కదలొచ్చని, ఫలితంగా ఐపీఓ మార్కెట్‌‌ డల్‌‌గానే ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా ఎక్కువ వాల్యుయేషన్ దగ్గర కంపెనీలు ఫండ్స్ సేకరించాయని, వచ్చే ఏడాది భారీగా  వాల్యుయేషన్లు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఐపీఓ ధరలు తగ్గుతాయని అన్నారు. ప్రైమ్‌‌ డేటాబేస్   ప్రకారం,  ఈ ఏడాదిలో డిసెంబర్ 16 వరకు మొత్తం 36 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.56,940 కోట్లు సేకరించాయి. ఈ  వారం  కేఫిన్‌‌ టెక్‌‌, ఎలీన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. రూ. 1,975 కోట్లను సేకరించనున్నాయి. వీటిని కూడా కలుపుకుంటే ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన కంపెనీల సంఖ్య 38 కి పెరుగుతుంది. కిందటేడాది ఏకంగా 63 కంపెనీలు ఐపీఓకి రాగా, మొత్తం రూ.1.2 లక్షల కోట్లను సేకరించాయి. గత 20 ఏళ్లలో ఐపీఓలకు ఇదే  బెస్ట్ ఇయర్‌‌‌‌. 2020 లో 15 కంపెనీలు ఐపీఓకి రాగా, రూ.26,611 కోట్లను సేకరించాయి.

పెద్ద ఐపీఓలు ఇవే..

ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓల్లో  ఎల్‌‌ఐసీ ముందుంది. ఈ కంపెనీ రూ.20,557 కోట్లను సేకరించింది. ఆ తర్వాత డెల్హివరీ (రూ.5,235 కోట్లు), అదానీ విల్‌‌మార్‌‌‌‌ (రూ.3,600 కోట్లు), వేదాంత్‌‌ ఫ్యాషన్ (రూ.3,149 కోట్లు), గ్లోబల్‌‌ హెల్త్‌‌ (రూ.2,205 కోట్లు) ఐపీఓలు ఉన్నాయి. ఈ ఏడాది కంపెనీల షేర్లు  లిస్టింగ్ రోజు, ఆ తర్వాత పెద్దగా పెరగలేదని సెంట్రమ్ క్యాపిటల్‌‌ ఎండీ రాజేంద్ర నాయక్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి  ఆసక్తి కరువవ్వడమే ఇందుకు కారణమని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌‌, పీఎంఎస్ స్కీమ్స్‌‌ వంటి డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా రూ.500–1,500 కోట్ల రేంజ్ ఉన్న ఐపీఓల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని అన్నారు. అందువలన పెద్ద ఐపీఓలతో పోలిస్తే ఇవి సక్సెస్‌‌ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్త తరం టెక్ కంపెనీలు మార్కెట్‌‌లోకి రాలేదు. మొత్తం 36 ఐపీఓల్లో రెండు కంపెనీలే (డెల్హివరీ, ట్రాక్షన్ టెక్‌‌)  కొత్త తరం టెక్ కంపెనీలు ఉన్నాయి. పేటీఎం, ఇతర టెక్ కంపెనీల షేర్లు లిస్టింగ్ తర్వాత నుంచి పడుతూనే ఉండడంతో ఇటువంటి కంపెనీలపై ఇన్వెస్టర్లకు ఆసక్తి తగ్గింది. కేవలం 14 ఐపీఓలు మాత్రం 10 రెట్లు కంటే ఎక్కువగా సబ్‌‌స్క్రయిబ్ అయ్యాయి. వీటిలో 75 రెట్లతో హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ టాప్‌‌లో ఉంది.  ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా (72 రెట్లు), డీసీఎక్స్ సిస్టమ్స్ (70 రెట్లు) ఆ తర్వాతి ప్లేస్‌‌లలో ఉన్నాయి. ఫైవ్‌‌స్టార్ బిజినెస్‌‌ ఫైనాన్స్ ఐపీఓ మాత్రమే పూర్తిగా సబ్‌‌స్క్రయిబ్ కాలేదు. ప్రధాన ఐపీఓ మార్కెట్‌‌ను మినహాయిస్తే   ఎస్‌‌ఎంఈ   ఐపీఓల ద్వారా ఈ ఏడాది రూ.1,807 కోట్లను సేకరించాయి. కిందటేడాది రూ.746 కోట్లను సేకరించాయి. రూ.88,140 కోట్ల విలువైన ఐపీఓలు ఇప్పటికే సెబీ అనుమతి పొందాయని ప్రైమ్ డేటాబేస్‌‌ ఎండీ ప్రణవ్‌‌ హల్దియా అన్నారు. రూ.51,215 కోట్ల విలువైన మరో 30 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.