రాహుల్ దూకుడుకు మోదీ అడ్డుకట్ట వేయగలరా!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్​లో విపక్ష నేత రాహుల్ గాంధీ వల్ల  కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో  పడుతున్నది.  మాటల్లో,  చేతల్లో  నిజాయితీ గల రాహుల్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం అని భావిస్తున్నది.  నిజాలు చెప్పడంలో  రాహుల్ గాంధీ ఎవ్వరికీ భయపడడు.  భయం అనేది ఆయన కండ్లలో కనిపించదు. విదేశాల్లోనూ ఆయన వాస్తవాలు చెబుతాడు.  

మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఎలా ఆపగలం అని యోచిస్తోంది.  పీఎం నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ  అని మాత్రమే  కాకుండా,  బీజేపీ, ఆర్ఎస్ఎస్  వర్సెస్ రాహుల్ గాంధీ అనేవిధంగా పరిస్థితి మారిపోయింది.  ప్రభుత్వ అధీనంలో ఉన్న  మీడియాగా పేరుగాంచిన జాతీయ మీడియా కూడా  ఇప్పుడు  రాహుల్ ను  ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది.

రాహుల్ ప్రజల్లోకి చొరవగా వెళుతున్నారు. ఒకసారి చెప్పులు కుట్టే షాప్​లోకి,  మరోసారి రైతు పొలంలోకి,  బిల్డింగ్ నిర్మాణ కార్మికుల వద్దకు,  సామాన్యులు ప్రయాణించే బస్సులోకి, లారీలోకి,  ట్రైన్, ఆటోలో ప్రయాణం, ఖార్ఖానాలో కార్మికుల వద్దకు,  బొగ్గు గని కార్మికుల దరికి, 16 నెలలుగా మండుతున్న మణిపూర్​కు,  రైలు, వరద ప్రమాద బాధితుల వద్దకు.. ఎక్కడ సహాయం అవసరం ఉంటే అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలుస్తున్నారు.  

దేశంలో పెరుగుతున్న అప్పులు, అసమానతలు

రాహుల్  పాపులారిటీ  రోజురోజుకూ పెరిగిపోతున్నది.  బీజేపీ ఐటీ సెల్,  ఎప్పుడూ  రాహుల్ ను  విమర్శించి ఆయన తప్పులు పట్టడానికి ఒక టూల్ కిట్ పట్టుకుని తిరిగే బీజేపీ నేత సందీప్ పాత్రలాంటి వారి పప్పులు కూడా ఉడికే పరిస్థితి కనిపిస్తలేదు.  దేశంలో  నిరుద్యోగం,  అప్పులు, పెరుగుతున్న అసమానతలు, నిత్యావసరాల ధరలు మరోవైపు ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితి కనిపిస్తున్నది.

హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి.  పీఎం నరేంద్ర మోదీ అబద్ధాలను విపక్షనేతగా   రాహుల్  బట్టబయలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది బీజేపీకి ఒక పరిష్కరించలేని సమస్యగా మారింది.  గడిచిన రెండు ఏండ్లలో యువత మీద రాహుల్ ప్రభావం పెరుగుతోంది.  ఈ పరిణామం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ ఒంటరిగా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితికి కారణం అయ్యింది.

మోదీ సర్కార్  అవినీతిని  రాహుల్ బట్టబయలు చేస్తున్నారు. సెబీ చీఫ్ మాధవి బుచ్ మీద వచ్చిన ఆరోపణలు,  హిండెన్ బర్గ్ రిపోర్ట్,  గతంలో  గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర,  జార్ఖండ్  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి రాహుల్ గాంధీ, ఇండియా కూటమిలోని నేతల ప్రభావం తప్పనిసరిగా ఎన్నికల మీద కనిపించబోతున్నది.   

ఫేస్ టు ఫేస్  డిబేట్​కు  నేతలు సిద్ధం కావాలి

గతంలో 50 గంటలు రాహుల్​ను ఈడీ ప్రశ్నించి ఇబ్బందిపెట్టింది. మోదీ ఇంటిపేరు విషయంలో జరిగిన వివాదంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి ఇల్లు ఖాళీ చేయించడం జరిగింది. రాహుల్​పై అనేక కేసులు నమోదు చేస్తున్నారు.  అమెరికాలో వాస్తవాలు మాట్లాడినందుకు..దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని అధికార నేతలు ఆరోపిస్తున్నారు.  రాహుల్ విధానంలో నీతి, నిజాయితీ, నిజం ఉంది. 

కాబట్టి, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది! ఎంప్లాయ్​మెంట్, ఎడ్యుకేషన్, బిజినెస్ సిస్టం, నైపుణ్యం మీద, కార్పొరేట్​లకు రూ.16 లక్షల కోట్ల  మాఫీ,  అదానీకి చెందిన సంస్థలకే  ఎయిర్ పోర్ట్,  పోర్ట్,  గనులు, రహదారుల నిర్మాణం ఇవ్వడం మీద కూడా రాహుల్ గాంధీ చెబుతున్న విషయాల మీద కేంద్రం వద్ద సమాధానం లేదు.  ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీకి, పీఎం మోదీకి కొరకరాని కొయ్య అయ్యారు.  ప్రజలు చైతన్యవంతులై  విద్వేష,  మతోన్మాదంపై  దాదాపు యుద్ధం ప్రకటిస్తున్నప్పుడు,  రాహుల్ గాంధీ  ప్రేమ, ఆత్మీయ సందేశాల్ని స్వీకరిస్తున్నప్పుడు రాజ్యాధికారం ఏం చేయగలదు. అబద్ధాలు ఎంతకాలం మనగలవు.  అమెరికాలో అక్కడి పాలకుల మాదిరి మన పాలకులు కూడా ఫేస్ టు ఫేస్  డిబేట్​కు  నేతలు సిద్ధం అయితే ఎవరు ఏమిటో,  ఎవరు అబద్ధాలకోరు అనేది వెల్లడి అవుతుంది.

- ఎండి. మునీర్