కంపా ప్రపోజల్స్ ఇక ఆన్​లైన్​లో

  • ఇప్పటికే అన్ని జిల్లాల కంప్యూటర్  ఆపరేటర్లు, డీఎఫ్ఓలకు ట్రైనింగ్ పూర్తి
  • ఈ విధానంతో సేవలు సులభతరం

హైదరాబాద్, వెలుగు: సేవలు సులభతరం చేయడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు అటవీ శాఖ కంపా (కాంపెన్సెటరీ అఫోర్ స్టేషన్‌‌ ఫండ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అండ్‌‌ ప్లానింగ్‌‌ అథారిటీ) ప్రతిపాదనలను ఆన్ లైన్  విధానంలో పంపించేలా చర్యలు చేపట్టింది. ఏటా యాన్యువల్  ప్లాన్  ఆఫ్ ఆపరేషన్ (ఏపీఓ)  కోసం కేంద్రానికి రాష్ట్ర అటవీ శాఖ ప్రతిపాదనలు పంపిస్తోంది. కంపాలో భాగంగా చేపట్టే పనులు, అవసరమైన నిధుల కోసం  డీఎఫ్ఓలు ప్రతిపాదనలు తయారుచేసి స్టేట్  ఆఫీసుకు పంపుతారు.

ఆ ప్రతిపాదనలు అక్కడి నుంచి నేషనల్ కంపా ఆఫ్ ఢిల్లీకి వెళ్తాయి. ఈ ప్రక్రియ అంతా ఇప్పటి వరకు ఆఫ్ లైన్  విధానంలో కొనసాగింది. దీనివల్ల సేవల్లో  జాప్యం జరగడంతో పాటు పారదర్శకత లోపించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను ఆన్ లైన్ లో పంపితే త్వరగా సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రపోజల్స్ లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే ఈజీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ విడుదలలోనూ జాప్యం ఉండదని పేర్కొంటున్నారు. 

రెండంచెల్లో ప్రతిపాదనల స్ర్కుటినీ

కంపా నిధులతో అడవుల అభివృద్ధి, పునరుద్ధరణ, అటవీ భూములు ఆక్రమణకు కాకుండా రిజర్వ్‌‌ ఫారెస్ట్ లో  హద్దులు ఏర్పాటు చేయడం, జల సంరక్షణ కోసం నిర్మాణాలు చేపట్టడం, ప్లాంటేషన్, అడవులు అగ్ని ప్రమాదాలకు గురవకుండా చూడడం వంటి చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు నర్సరీలు ఏర్పాటు చేస్తారు. వన్య ప్రాణులకు తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తారు. శాకాహార జంతువులకు గ్రాసం కోసం గడ్డిక్షేత్రాలు ఏర్పాటు చేస్తారు.

ఈ పనుల కోసం నిధులు కేటాయించాలని యాన్యువల్  ప్లాన్  ఆఫ్  ఆపరేషన్ లో భాగంగా జిల్లాల నుంచి డీఎఫ్ఓలు ఆన్ లైన్ లో స్టేట్  కన్జర్వేటర్ కు ప్రతిపాదనలు పంపుతారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను స్టేట్  కన్జర్వేటర్  పరిశీలించి కంపా సీఈఓకు పంపిస్తారు. ఆయన స్ర్కుటినీ చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి వాటిని మళ్లీ డీఎఫ్ఓలకు పంపిస్తారు. వారు మార్పులు, చేర్పులు చేసి పంపిస్తే అన్ని ఓకే అనుకుంటే వీరు పరిశీలించి పీసీసీఎఫ్ కు పంపిస్తారు. ఆయన ఓకే అనుకుంటే ప్రతిపాదనలను నేషనల్  కంపా ఆఫ్  ఢిల్లీకి ఆన్ లైన్ లో సమర్పిస్తారు.  

26 జిల్లాల నుంచి ప్రతిపాదనలు

ఇప్పటి వరకు  26 జిల్లాల నుంచి ఆన్ లైన్ లో ప్రతిపాదనలు వచ్చాయి. ఆరు జిల్లాల ప్రతిపాదనలు డ్రాఫ్ట్  లెవల్ లో ఉన్నాయి. కాగా.. ఆన్ లైన్  విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉండగా.. కంపా ప్రతిపాదనలను ఆన్ లైన్ లో పంపించడంలో తెలంగాణ ముందు ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పడిప్పుడే ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఈ విధానంపై డీఎఫ్ఓలకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.