Border–Gavaskar Trophy: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ దూరం

భారత్- ఆస్ట్రేలియా తలపడబోయే ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్టార్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యువ ఆల్ రౌండర్ వెన్ను గాయం కారణంగా భారత్‌తో జరగనున్న మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. గ్రీన్ శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. అదే జరిగితే కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల విరామం అవసరం. 

ఆస్ట్రేలియాలో పేరు గాంచిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతూ గ్రీన్ గాయపడ్డాడు. దీంతో ఈ టోర్నీకి అతను దూరంగా ఉన్నాడు. అంతకముందు గాయం కారణంగా గ్రీన్ స్పెషలిస్ట్ బ్యాటర్ గానే బరిలోకి దిగుతాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఈ సుదీర్ఘ సిరీస్ కు దూరం కానున్నాడు. త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ గాయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడకపోతే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. 

Also Read : సొంత గడ్డపై ఘోర పరాభవం

సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది. 

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.