పన్ను ప్రాబ్లమ్స్​ తీరిస్తే మళ్లీ ఇన్వెస్ట్‌‌ చేస్తాం..

పన్ను ప్రాబ్లమ్స్​ తీరిస్తే మళ్లీ ఇన్వెస్ట్‌‌ చేస్తాం..

కెయిర్న్‌‌ ఎనర్జీ ప్రకటన

న్యూఢిల్లీ : తాము ఎదుర్కొంటున్న రెట్రాస్పెక్టివ్‌‌ టాక్స్‌‌ సమస్య పరిష్కరిస్తే, మళ్లీ ఇండియాలో పెట్టుబడులు పెడతామని కెయిర్న్‌‌ ఎనర్జీ పీఎల్‌‌సీ సీఈఓ వెల్లడించారు. బ్రిటన్‌‌కు చెందిన ఈ కంపెనీ ఇండియాలోనే అతి పెద్ద చమురు, సహజవాయువు నిక్షేపాన్ని కేజీ బేసిన్‌‌లో కనుగొంది. కృష్ణా–గోదావరి బేసిన్‌‌లోని రవ్వ ఆయిల్‌‌ అండ్‌‌ గాస్ ఫీల్డ్‌‌తో 1990 వ దశకం మొదటి నుంచి  కెయిర్న్‌‌ ఇక్కడ బాగా ఎదిగింది.  రాజస్థాన్‌‌లోని థార్‌‌ ఎడారిలోనూ అతి పెద్ద ఆన్‌‌లాండ్‌‌ చమురు నిక్షేపాన్ని కెయిర్న్‌‌ ఎనర్జీ కనుగొంది. 2014 లో రూ. 10,247 కోట్ల పన్ను చెల్లించమంటూ ప్రభుత్వం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసు ఇచ్చింది. అంతేకాదు, కెయిర్న్‌‌ ఎనర్జీకి చెందిన డివిడెండ్‌‌ ఇన్‌‌కంను ఇన్‌‌కంటాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ జప్తు చేసింది.

కంపెనీకి చెల్లించాల్సిన పన్ను రిఫండ్స్‌‌ను నిలిపివేయడంతోపాటు, షేర్లను కూడా డిపార్ట్‌‌మెంట్‌‌ అమ్మేసింది. ఇండియాలో కొత్త నిక్షేపాలను కనుగొనాలని ఆశపడుతున్నామని, మళ్లీ పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని కెయిర్న్‌‌ సీఈఓ సైమన్‌‌ థామ్సన్‌‌ తెలిపారు. 2011లో కెయిర్న్‌‌ తన ఇండియా బిజినెస్‌‌ను వేదాంత లిమిటెడ్‌‌కు అమ్మేసింది. రెట్రాస్పెక్టివ్‌‌ టాక్స్‌‌ విధింపు మీద అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌‌ ట్రిబ్యునల్‌‌లోనూ కెయిర్న్‌‌ కేసు వేసింది. ఈ ట్రిబ్యునల్‌‌ ఇచ్చే తీర్పును ఇండియా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు సైమన్‌‌ థామ్సన్‌‌ చెప్పారు. కెయిర్న్‌‌పై రెట్రాస్పెక్టివ్‌‌ టాక్స్‌‌ విధించిన తర్వాత, ప్రభుత్వం మొత్తం అయిదు దఫాల ఆక్షన్‌‌ నిర్వహించింది.

ఇందులో మూడు ప్యూర్‌‌ ప్లే ఎక్స్‌‌ప్లొరేషన్‌‌ బ్లాకులుండగా, రెండు ఆయిల్‌‌, గాస్‌‌ ఫీల్డ్స్‌‌ ఉన్నాయి. కానీ, వాటిలో పెద్ద విదేశీ కంపెనీలను ఆకట్టుకోలేకపోయాయి. ఓఎన్‌‌జీసీ, వేదాంత వంటి దేశీయ కంపెనీలే ముందుకు వచ్చాయి. ఇండియాలో 20 ఏళ్లు కార్యకలాపాలు నిర్వహించడంతో, తమకు ఈ రంగంపై మంచి పట్టు లభించిందని సైమన్‌‌ థామ్సన్‌‌ అన్నారు. ఓఎన్‌‌జీసీ సహా ఎవరిని అడిగినా తమ ఆపరేషన్స్‌‌ సామర్థ్యం గురించి చెబుతారని పేర్కొన్నారు.   రవ్వ క్షేత్రంలో ఉత్పత్తి ఇంకా కొనసాగుతుండగా, రాజస్థాన్‌‌ నిక్షేపం మాత్రం 30 శాతం ఉత్పత్తికే పరిమితమైంది. రాజస్థాన్‌‌ నిక్షేపంలో ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి 20 బిలియన్‌‌ డాలర్ల ఆదాయం వచ్చిందని సైమన్‌‌ థామ్సన్‌‌ తెలిపారు.