ప్రాణాలు తీసిన ఆన్​లైన్ గేమ్స్​ బెట్టింగ్​.. లింగాలలో విషాదం

  • అప్పుల పాలై సీఏ స్టూడెంట్​ ఆత్మహత్య

లింగాల, వెలుగు : స్నేహితులతో కలిసి సరదాగా మొదలుపెట్టిన ఆన్​లైన్ గేమ్స్..బెట్టింగ్​ పెట్టి ఆడేవరకూ వెళ్లింది. అది అప్పులపాలు చేసి చివరకు ప్రాణం తీసింది. ఎస్ఐ జగన్మోహన్​రెడ్డి కథనం ప్రకారం.. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి మాజీ సర్పంచ్ వనజ, విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల ఒక్కగానొక్క కొడుకు శషాంక్(35) హైదరాబాద్​లో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. 

కొన్ని నెలలుగా స్నేహితులతో కలిసి సరదాగా ఆన్​లైన్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు. రాను రాను బెట్టింగ్ ​పెట్టి ఆడే స్థాయికి చేరాడు. ముందు కొన్ని లక్షలు పోగా అవి రాబట్టుకోవడానికి మళ్లీ బెట్టింగ్​పెట్టి మరి కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు. ఇలా సుమారు రూ. 20 నుంచి 50 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై శనివారం రాత్రి హైదరాబాద్​నుంచి బైక్​పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లకుండా కొత్తకుంటపల్లిలోని తమ మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు. 

ప్రతిరోజు మాదిరిగానే తోటకు వెళ్లిన శశాంక్ ​తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి కొడుకు చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో షాక్​కు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి రెండేండ్ల కింద పెండ్లి కాగా, పిల్లలు లేరు. తమ కొడుకు బెట్టింగ్ పాల్పడుతున్నట్లు తమకు తెలియదని, అప్పు చేశానని చెప్తే ఆస్తులు అమ్మి అయినా తీర్చేవాళ్లమని కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.