- 6 నెలల్లోని 2 బిలియన్ డాలర్లు పెరిగిన వాల్యుయేషన్
- పిల్లల చదువుకు ఎంతైనా ఖర్చుపెట్టే పేరెంట్సే మా ఆస్తి
- రూ.37,750 కోట్లకు బైజూస్ వాల్యుయేషన్
- ఒక్క రౌండ్ లోనే 53 శాతం జంప్
- రూ.1,430 కోట్లకు చేరిన రెవెన్యూ
ముంబై : ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుడ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్ వాల్యుయేషన్‌లో దూసుకుపోతోంది. సిరీస్ ఎఫ్ ఫండింగ్ రౌండ్‌లో బైజూస్ చరిత్ర సృష్టించింది. దీని వాల్యుయేషన్ ఒక్కసారిగా రూ.37,750 కోట్లకు(5.5 బిలియన్ డాలర్లకు) జంప్ చేసింది. ఈ ఒక్క సింగిల్ రౌండ్ ఫండింగ్‌లోనే బైజూస్ వాల్యు అనూహ్యంగా 53 శాతం మేర పెరిగింది. డిసెంబర్ నుంచి ఈ నిధుల సేకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బైజూస్ ఇప్పటి వరకు సిరీస్ ఎఫ్ రౌండ్‌లో రూ.3,159.4 కోట్ల నిధులు సేకరించింది. సౌతాఫ్రికాకు చెందిన నాస్పర్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటికా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డులు ఈ నిధుల సేకరణలో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.సీరిస్ ఎఫ్ రౌండ్ చేపట్టినప్పుడు సంస్థ వాల్యుయేషన్ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత జూలై మొదటి వారంలో లెక్క కట్టిన వాల్యుయేషన్‌లో ఇది రూ.5.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అంటే 6 నెలల్లోని 2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతర్ ప్రభుత్వ సావరీన్ వెల్త్ ఫండ్, ఓవల్ వెంచర్స్ వంటివి కొత్త ఇన్వెస్టర్లుగా బైజూస్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
కే 12 స్టూడెంట్ల కోసం లెర్నింగ్ ప్రొగ్రామ్స్…
ఇతర స్టార్టప్‌ల మాదిరి ఇయర్ ఆన్ ఇయర్ వాల్యుయేషన్‌ను పెంచుకోకుండా.. బైజూస్ నెలవారీ తన వాల్యుయేషన్‌ను పెంచుకుంటున్నట్టు పేపర్.వీసీ ఫౌండర్ వివేక్ దురై అన్నారు. బైజూస్ అమెరికా మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ మార్కెట్ కూడా ఈ ఎడ్యుకేషన్ స్టార్టప్ వాల్యుయేషన్ పెరిగేందుకు దోహదం చేసినట్టు ఇన్వెస్టర్లు చెప్పారు. బైజూస్ ఇండియన్ పేరెంట్స్ నుంచి బాగా లబ్ది పొందుతోంది. ఇండియన్ పేరెంట్స్ తమ పిల్లలకు సరియైన ఎడ్యుకేషన్ ఇప్పించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడరని ఇన్వెస్టర్లు తెలిపారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో పిల్లలకు అర్థంకాని టాపిక్స్‌ను, బైజూస్ క్షుణ్ణంగా వివరిస్తూ ఉంటోంది. కే 12 స్టూడెంట్ల కోసం తీసుకొస్తోన్న లెర్నింగ్ ప్రొగ్రామ్స్, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేస్తోన్న వెంచర్లు బైజూస్ వృద్ధికి సాయపడుతున్నాయి.
రూ.3 వేల కోట్ల రెవెన్యూనే టార్గెట్…
బైజూస్ గణనీయమైన వృద్ధి సాధిస్తుండటంతో వాల్యుయేషన్ కూడా అనూహ్యంగా పెరుగుతున్నట్టు నిపుణులు చెప్పారు. బెంగళూరుకు చెందిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్.. బైజూస్‌ను నిర్వహిస్తోంది. మార్చి 31 తో ముగిసిన ఏడాదికి బైజూస్ రెవెన్యూ మూడింతలు పెరిగి రూ.1,430 కోట్లకు చేరింది. ఫుల్ ఇయర్ బేసిస్‌లో ఇది లాభాల్లోకి వచ్చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీని రెవెన్యూ టార్గెట్ రూ.3 వేల కోట్లుగా ఉంది. ఏప్రిల్‌లో కంపెనీకి 3.5 కోట్ల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. 24 లక్షల మంది పెయిడ్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. నెలవారీగా బైజూస్‌కు రూ.200 కోట్ల రెవెన్యూను అందుకుంటోంది.
