- ప్రపంచంలో జనాల ఎత్తు, బరువు పెరగడమే కారణం
- దానికి తగ్గట్టు రోజూ మరో 253 కేలరీలు ఎక్కువ అవసరం
- పేద దేశాలపైనే పెను ప్రభావం.. జర్మనీ సైంటిస్టుల స్టడీ
ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని జనాలకు 80 శాతం ఎక్కువ ఫుడ్డు కావాల్సి వస్తుందట. దానికి కారణం, ఏ పర్యావరణ మార్పులో, ఆహార కొరతో కాదు. జనాల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరిగిపోవడమే అందుకు కారణమట. అంటే ఎక్కువ బరువు, ఎక్కువ ఎత్తుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో వారి బాడీకి తగ్గట్టు ఆహార అవసరం కూడా 80 శాతం ఎక్కువ అవసరమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ గోటింజెన్ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. దాంతో పాటు ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు 60 శాతం ఎక్కువ కేలరీలూ అవసరమవుతాయని సైంటిస్టులు చెప్పారు. ప్రస్తుతం 700 కోట్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభా, 2100 నాటికి 1100 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ చెబుతోంది. 2010తో పోలిస్తే ఇప్పుడు జనాల ఎత్తు, బరువు పెరుగుతోందని, ఇప్పటికే వాళ్లకు 18 శాతం ఎక్కువ కేలరీలు అవసరమవుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు.
253 కేలరీలు పెరుగుతాయ్
2100 నాటికి సగటు మనిషికి అవసరమయ్యే ఆహారం 253 కేలరీలు పెరుగుతుందని సైంటిస్టులు అంచనా వేశారు. ‘‘2010 నుంచి ఇండియా, నైజీరియాల్లోని జనాల బీఎంఐకి తగ్గట్టు అవసరమవుతున్న ఆహారాన్ని లెక్కలోకి తీసుకున్నాం. మొత్తంగా ప్రపంచాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటున్న దానికి మరో 253 కేలరీల ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది” అని వరల్డ్ వెజిటెబుల్ సెంటర్ సైంటిస్ట్ లూట్జ్ డిపెన్బుష్ చెప్పారు. అంటే 2 అరటిపళ్లను మెనూలో ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆహార అవసరాలు పెరగడం వల్ల ఎక్కువగా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలపైనే ప్రభావం పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు సరిపడినంత ఆహారం ఉండట్లేదని, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఎక్కువ తిండి అవసరమవుతోందని అంటున్నారు. ఈ పెరుగుదలకు తగ్గట్టు ప్రపంచ ఫుడ్ పాలసీని తయారు చేయకపోతే దాని ప్రభావాలు మరింత ఎక్కువగా ఉండే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆహార, ఆర్థిక అసమానతలకు అది దారి తీస్తుందని చెబుతున్నారు. ఆహార అవసరాలు పెరిగితే ధరలూ ఆకాశాన్నంటే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. డబ్బున్న దేశాలకు నష్టం లేకపోయినా, వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేని పేద దేశాలే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని, పోషకాహారలోపం పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
