న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రమోటర్లు - టాటా సన్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.18వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూను చేపడుతున్నట్టు ఈ నెల 5న ప్రకటించాయి. ఈ ఆఫర్ మార్చి 9న ఓపెన్ అయి మార్చి 23 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ‘ ప్రతి 7 ఈక్విటీ షేర్లకు ఒక ఈక్విటీ షేర్’ విధానంలో రిజర్వుడు కేటగిరీలోని చిన్న వాటాదారుల కోసం బైబ్యాక్ రేషియో ఉంటుంది. ఇతర అర్హత కలిగిన షేర్‌హోల్డర్‌లందరికీ సాధారణ కేటగిరీలో బైబ్యాక్ నిష్పత్తి "రికార్డ్ తేదీలో ఉన్న ప్రతి 108 ఈక్విటీ షేర్లకు 1 ఈక్విటీ షేర్" పద్ధతిలో ఉంటుంది. టీసీఎస్ ప్రమోటర్లు - టాటా సన్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అందజేసిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఇవి సుమారు 2.88 కోట్ల షేర్లను కొంటాయి. ఇందుకు రూ.18 వేల కోట్లు చెల్లిస్తాయి. ఈ మేరకు ఒక ప్రపోజల్‌ను బుధవారం టీసీఎస్ బోర్డ్ ఆమోదించింది. ఒక్కో షేరు విలువను రూ.4,500 చొప్పున లెక్కిస్తారు. ప్రమోటర్ కంపెనీలు టాటా సన్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ కూడా బైబ్యాక్ ఆఫర్‌లో పాల్గొనాలని భావిస్తున్నాయి. దాదాపు 266.91 కోట్ల షేర్లను కలిగి ఉన్న టాటా సన్స్ 2.88 కోట్ల షేర్లను టెండర్ చేయాలని భావిస్తుండగా, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (10,23,685 షేర్లు ఉన్నాయి) 11,055 షేర్లను టెండర్ చేయాలని కోరుకుంటోంది. టీసీఎస్గతంలోనూ రూ.16వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ఇష్యూను డిసెంబర్ 18, 2020న ప్రారంభించి జనవరి 1, 2021న ముగించింది. దీనిలో గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ రూ.9,997.5 కోట్ల విలువైన షేర్లను టెండర్ చేసింది. ఆ సమయంలో 5.33 కోట్లకు పైగా ఈక్విటీ (ఒక్కొక్కటి రూ.3వేల చొప్పున) షేర్లను కొన్నది. మొత్తంగా 5,33,25,118 షేర్లను బైబ్యాక్ ఆఫర్‌లో దక్కించుకుంది. గురువారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లోని పోస్టల్ బ్యాలెట్ ప్రకారం, జనవరి 12, 2022 నాటికి ప్రమోటర్ కంపెనీలకు టీసీఎస్‌లో 72.19 శాతం వాటా ఉంది. జనవరి 6, 2022 నాటికి బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో ఈక్విటీ షేరు ముగింపు ధర ఒక్కో షేరుకు రూ.4,500 ఉంది.
