యాపిల్ మ్యాక్ ప్రో ధర 37 లక్షలు
యాపిల్ అంటేనే బ్రాండ్లకు పెద్దన్న. అట్లాంటి బ్రాండ్ రేటు కూడా అంతే ఉంటుంది. కానీ, ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చిన కొత్త కంప్యూటర్ రేటే కళ్లు బైర్లుగమ్మేలా ఉంది. అవును, మరి దానికి పెట్టే రేటుతో ఆడి స్టార్టింగ్ రేంజ్ కారును లేదంటే టెస్లా మోడల్ 3 కారును ఈజీగా కొనేయొచ్చు మరి. జూన్‌లోనే తన సరికొత్త మ్యాక్ప్రోను పరిచయం చేసిన యాపిల్, తాజాగా దాన్ని అమ్మేందుకు రెడీ అయిపోయింది. దాని రేటే 52 వేల డాలర్లు. అంటే దాదాపు 36 లక్షల 84 వేల రూపాయలు. అయితే, అది హై ఎండ్ ధర మాత్రమే. దాని స్టార్టింగ్ రేంజ్ కూడా 5,999 డాలర్లు. అంటే 4 లక్షల రూపాయలు. మామూలు ఫీచర్లలో 6కే డిస్ప్లేతో వస్తుంది ఈ మ్యాక్ ప్రో. హై ఎండ్ మ్యాక్ ప్రోలో కేవలం మానిటర్ ధరే 6 వేల డాలర్లు (రూ.4 లక్షలు). దానికి ప్రో డిస్ప్లే ఎక్స్‌డీఆర్ కావాలంటే మాత్రం మరో 5 వేల డాలర్లు (రూ.3.54 లక్షలు) ఎక్కువ పెట్టాల్సిందే. కంప్యూటర్ను పెట్టే స్టాండ్ రేటు కూడా మామూలుగా లేదు. దాని విలువ 999 డాలర్లు (దాదాపు రూ.71 వేలు). స్టార్టింగ్ రేంజ్లో 32 జీబీ ర్యామ్‌తో వస్తుంది యాపిల్ మ్యాక్ ప్రో. కానీ, 1.5 టెర్రాబైట్స్ కావాలంటే అదనంగా 25 వేల డాలర్లు (సుమారు రూ.17.72 లక్షలు) చెల్లించాలి. చెప్పాలంటే దీనితోనే కంప్యూటర్ ధర ఎక్కువైపోయింది. 256 జీబీ స్టోరేజీతో వచ్చే కంప్యూటర్ను 4 టీబీకి మార్చుకోవాలంటే మరో 1400 డాలర్లు (దాదాపు రూ.లక్ష) వరకు పెట్టాలి. కంప్యూటర్ను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్లడానికి వీల్స్ కూడా ఇస్తోంది కంపెనీ. దానికో 400 డాలర్లు. అంటే రూ.28 వేలు. ఇలా ఒక్కొక్కటి అన్ని కలిపి యాపిల్ మ్యాక్ ప్రో ధర రూ.36.84 లక్షల వరకు పోయిందన్నమాట. ఇంకో విషయమేంటంటే, దాని స్క్రీన్‌ను కంపెనీ ఇచ్చే క్లాత్‌తోనే తుడవాలట. కంపెనీనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. కంప్యూటర్ డిస్ప్లేని స్పెషల్ కోటింగ్‌తో చేశారట. దాని వల్ల ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుందట. కాబట్టి మామూలు క్లాత్‌తో తుడిస్తే ఆ కోట్ పోయి, మానిటర్ పాడయ్యే అవకాశముందట. అందుకే కంప్యూటర్‌తో పాటే వచ్చే క్లాత్‌తోనే తుడవాలని కంపెనీ సూచించింది. అది పోతే మళ్లీ క్లాత్‌ను ఆర్డరిచ్చి కొనుక్కోవాలని చెబుతోంది.
