చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఆంధ్ర ప్రదేశ్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు హైవేపై మొగిలి ఘాట్ వద్ద బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో లారీ.. బస్సును ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో బంగారుపాలెం, పలమనేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

బస్సు పలమనేర్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం జరగడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.