కుంభమేళా స్పెషల్ అట్రాక్షన్: 32 ఏండ్లుగా.. బస్సే ‘శివాలయం’!

మహాకుంభ్​నగర్(యూపీ): ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ్ నగర్లో కుంభమేళా సందర్భంగా పాతకాలం నాటి బస్సు స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తోంది. కుంభమేళా వద్ద సంగమ్ లోయర్ రోడ్ ప్రాంతంలో సాధువులు, భక్తులు ఏర్పాటు చేసుకున్న టెంట్ల మధ్య నిలిపి ఉంచిన స్వామి సచ్చిదానంద్ చైతన్యకు చెందిన ఈ బస్సు నెల రోజుల నుంచే యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రపంచంలోనే అతి బరువైన 65 కేజీల స్ఫటిక శివలింగం కొలువుదీరడంతో ఈ బస్సును మినీ శివాలయంగా భావిస్తుంటారు. స్వామీజీ కూడా తీర్థయాత్రలకు దీనిలోనే వెళ్తూ.. ఇందులోనే నివసిస్తుంటారు. ఈ బస్సు గురించి స్వామీజీ మాట్లాడుతూ.. దీనిని తన గురువు శ్రీ లక్ష్మణ్ చైతన్య బ్రహ్మచారీజీ 1992లో ఉజ్జయిన్ సింహస్త కుంభ్ సందర్భంగా తయారు చేయించారని తెలిపారు.

‘‘2001లో కాశీలో పరమపదించేవరకూ అన్ని యాత్రలకూ ఆయన ఇందులోనే వెళ్లేవారు. మా గురువు తర్వాత ఆయన భార్య కల్యాణి చైతన్య బ్రహ్మచారిణీ కూడా ఇందులోనే నివసించారు. బస్సులో శివ లింగానికి పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. బస్సుపై ఉన్న ట్యాంకులో ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇతర పవిత్ర నదులు, జలాశయాల నుంచి సేకరించిన జలాలు ఉంటాయి. ఆ జలాలతోనే శివలింగానికి అభిషేకం జరుగుతుంది. ఈ శివలింగాన్ని పూజిస్తే సర్వ సిద్ధులూ పొందవచ్చని.. అందుకే ఈ బస్సుకు ‘శ్రీశ్రీ హర్ సిద్ధి’ అని పేరు పెట్టారు” అని స్వామీజీ వివరించారు.