చెక్​డ్యామ్​ కాలువ పూడ్చివేత..200 ఎకరాలకు సాగునీరు బంద్

రేవల్లి, వెలుగు : మండలంలోని చీర్కపల్లి గ్రామంలోని చెక్ డ్యాం నుంచి సర్వే నంబర్లు 36, 37, 46లోని భూమిలో నుంచి వెళ్లే కాలువ ద్వారా నీరు ఊరకుంటలోకి వెళతాయి. ఆ కుంట ద్వారా 200 ఎకరాలకు సాగు నీరందుతోంది. ఇటీవల ఆ పట్టాదారులు పొలాన్ని వేరే వారికి అమ్మడంతో వందేండ్ల నుంచి పంటలు సాగు చేసుకునే రైతులకు నీరందకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. వందేండ్ల కింద గోపాల్​పేట సంస్థానాధీశులు నారాయణరావు పట్టా నుంచి సాగు నీరు పోయేలా కాల్వ ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఆయన కొడుకులు భూమిని వేరే వారికి అమ్మారు.

వారు మరొకరికి అమ్మగా.. వారు పొలాల గుండా వెళ్లే కాల్వను పూడ్చి చదును చేశారు. దీంతో కుంటలోకి నీరు పారకపోవడంతో కుంట కింద 200 ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డికి బాధిత రైతులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ కు ఈ ఫిర్యాదును రెఫర్  చేశారు.

కలెక్టర్​ ఆదేశాల మేరకు ఏదుల ఇన్​చార్జి తహసీల్దార్  నాగేంద్రం, ఇరిగేషన్  ఏఈ వెంకటయ్య, ఆర్ఐ భాస్కర్ రెడ్డి, సర్వేయర్  వికాస్  ఘటనా స్థలానికి చేరుకొని కబ్జాకు గురైన కాలువను పరిశీలించారు. ఎప్పటిలాగే కాలువ నీళ్లు కుంటలోకి వచ్చేలా చూడాలని రైతులు అధికారులను కోరారు.