ఊరికి వెళ్లి వచ్చేసరికి..ఇల్లు గుల్ల..3 లక్షల సొత్తు మాయం

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారులో ఉండే ప్రాంతాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ముఠాలు, స్థానికంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు. 

తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. శుక్రవారం ఆగస్టు 09, 2024న హైదర్ గూడలో తాళం వేసి ఉంట్లో చోరీ జరిగింది. దాదాపు 3 లక్షల విలువ చేసే 40 తులాల బంగారం,  నగదు ఎత్తుకెళ్లారు.. వివరాల్లోకి వెళితే.. 

హైదర్ గూడలో నివాసం ఉంటున్న రాజేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులతో ఆదివారం నాడు తన సొంతూరుకి వెళ్లాడు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తలుపులు తాళం పగలగొట్టి విలువైన డాక్యుమెంట్లతోపాటు 40 తులాల బంగారం, నగదు  ఎత్తికెళ్లినట్లు రాజేష్ గుర్తించాడు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలకోసం గాలింపు చర్యలు చేపట్టారు.