అవి ఎక్కడ వాడాల్నో వాళ్లు యోగి దగ్గర నేర్చుకోవాలి: మోదీ

అవి ఎక్కడ వాడాల్నో వాళ్లు యోగి దగ్గర నేర్చుకోవాలి: మోదీ

 బారాబంకీ/ మోహన్ లాల్ గంజ్(యూపీ) :   కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే.. అయోధ్య రాముడి గుడి మీదుగా బుల్డోజర్లను నడుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘రామ నవమి, రామ మందిరం బేకార్ (యూజ్ లెస్) అని సమాజ్ వాదీ సీనియర్ నేత ఒకరు అన్నారు. అదేసమయంలో రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఎస్పీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రామ్ లల్లాను మళ్లీ టెంట్ లోకి పంపుతారు. రాముడి గుడిని బుల్డోజర్లతో కూలుస్తారు” అని ఆయన చెప్పారు. 

బుల్డోజర్లను ఎక్కడ నడపాలనే విషయంపై ఆ పార్టీల నేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్​కు వెళ్లి నేర్చుకోవాలన్నారు. శుక్రవారం యూపీలోని బారాబంకీ, మోహన్ లాల్ గంజ్ లోక్ సభ సెగ్మెంట్లలో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘జూన్ 4 ఎంతో దూరంలో లేదు. నేడు యావత్తు దేశంతోపాటు మొత్తం ప్రపంచానికే తెలుసు మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఒకవైపు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉంది. మరోవైపు దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకే ఇండియా కూటమి బరిలోకి దిగింది. అయితే ఒక్కో ఫేజ్ ఎన్నికలు పూర్తవుతుంటే.. ఇండియా కూటమి పేక ముక్కల్లా కుప్పకూలుతోంది” అని మోదీ అన్నారు. ‘‘మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలే మనకు కావాలి. ఐదేండ్ల పాటు మోదీని తిడుతూ కాలం గడిపేవాళ్లు కాదు. వేగంగా అభివృద్ధి జరగాలంటే.. బలమైన ప్రభుత్వం మాత్రమే చేయగలదు” అని ఆయన స్పష్టం చేశారు.

ఎస్పీ, కాంగ్రెస్ లకు ఓటుబ్యాంకే ముఖ్యం 

ఎస్పీ, కాంగ్రెస్ రెండు పార్టీలకూ తమ ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదని మోదీ అన్నారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల గుణగణాలు ఒకేవిధంగా ఉన్నాయని మోదీ విమర్శించారు. ‘‘ఆ రెండు పార్టీలు కుటుంబవాద రాజకీయాలు చేస్తాయి. కరప్షన్ పాలిటిక్స్ చేస్తాయి. ఓటుబ్యాంకు కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. క్రిమినల్స్, మాఫియాను ప్రమోట్ చేస్తారు. టెర్రరిస్టుల పట్ల సానుభూతితో ఉంటారు” అని అన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇదివరకు బీఎస్పీ చీఫ్ మాయావతిని ఆంటీ అని పిలిచేవారని.. ఇప్పుడు కొత్త ఆంటీ(మమతా బెనర్జీ) నుంచి షెల్టర్ పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘బిహార్​కు చెందిన దాణా స్కాం చాంపియన్ అనారోగ్యం సాకుతో జైలు నుంచి బయటకు వచ్చారు. మొత్తం రిజర్వేషన్లన్నీ ముస్లింలకే ఇవ్వాలని అంటున్నారు. దీనర్థం ఏంటంటే.. దళితులు, గిరిజనులు, బీసీలకు ఇక ఏమీ మిగలదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వరాదని రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. కానీ పదేండ్ల కిందట కాంగ్రెస్ కర్నాటకలో మతపరమైన రిజర్వేషన్లు తెచ్చింది. ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీలుగా మార్చేసింది. ఓబీసీల హక్కులను లూటీ చేసింది. అందుకే.. మీ హక్కులను కాపాడటం కోసమే మేం 400 సీట్లు అడుగుతున్నాం” అని మోదీ చెప్పారు.

కాంగ్రెస్ టార్గెట్ 50 సీట్లే.. 

లోక్ సభ ఎన్నికల్లో మొదటి నాలుగు విడతల్లో ఇండియా కూటమి ఆల్రెడీ ఓడిపోయిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు అయినా గెలుచుకుని పరువు కాపాడుకోవాలని చూస్తోందన్నారు. 2014లో కాంగ్రెస్ 44 సీట్లనే గెలుచుకుందని, 2019లో 52 సీట్లతో కొంచెం మెరుగుపడిందన్నారు. అందుకే ఇప్పుడు 50 సీట్లయినా గెలవాలని టార్గెట్ గా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 2019లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారని, అందుకే ఇప్పుడు రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.