ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఎక్కడ కావాలో చెప్పండి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి అధికారులను ఆదేశించారు. హెడ్ ఆఫీస్​లో సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఈ పనస రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోన్ల వారీగా వాటర్ లాగింగ్ పాయింట్లు, రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులపై మంగళవారం ఆయన సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జిల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ట్రాఫిక్ ఉన్న చోట పాదచారులకు ఇబ్బందులు కలగకుండా టెక్నికల్ ఫీజిబిలిటీని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో సమస్యను తగ్గించేందుకు శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మొదటి దశలో12 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్​నిర్మాణాలను చేపట్టగా నాలుగు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని వచ్చే నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

125 జంక్షన్ల అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులతో వేసిన కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. రూ.124.68 కోట్ల అంచనా వ్యయంతో 195 సుందరీకరణ పనులు చేపట్టగా, అందులో 28 పనులు పూర్తి అయినట్లు చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్లు పృథ్వి, బాలాజీ, జోనల్ ఎస్ఈలు రత్నాకర్, మహేశ్ రెడ్డి, నిత్యానంద, శంకర్ నాయక్, చిన్నా రెడ్డి, ఈఈ పాల్గొన్నారు.