2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్న నేపథ్యంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ నుండి వైసీపీలో చేరిన కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఘాటైన విమర్శలు చేశాడు. కేశినేని నాని వాపు చూసి బలుపు అనుకుంటున్నాడని, అతని వెనక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ కోసం, చంద్రబాబు కోసం కష్టపడతారని, నాని క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు బుద్ధా.
నాని సోదరుడు కేశినేని చిన్నిపై నాని గెలవటం అసాధ్యమని అన్నారు. లక్ష ఓట్లతో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.కేశినేని నాని మహా భారతంలో బృహన్నర లాంటోడని, అతనితో భీష్ముడు లాంటి మా వాళ్లు యుద్ధం చేయరని అన్నాడు. మూడు లక్షల ఓట్లతో ఓడిస్తానంటూ నాని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. ,ముందు ముందు నీకు మొసళ్ల పండుగ ఉంది కేశినేని నాని పిచ్చి వాగుడు మానుకుంటే మంచిదని అన్నాడు.
టిడిపి లో ఉన్న సమయంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ మొహం ఎలా ఉందో అద్దంలొ చూసుకో అంటూ ఎద్దేవా చేశాడు. టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది అని, అతని ఓటమి ఖాయమని అన్నాడు. నీ భవిష్యత్తు శూన్యం లక్ష ఓట్ల తేడా తో నిన్ను చిత్తు చేస్తామంటూ కేశినేని నానికి సవాల్ విసిరాడు బుద్ధా వెంకన్న. మరి, ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్ పోరులో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.