Buchi Babu Tournament 2024: బుచ్చిబాబు టోర్నీ విజేత హైదరాబాద్‌

భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద నిర్వహించిన ఆల్ ఇండియా బుచ్చి బాబు  టోర్నీ విజేగా హైదరాబాద్‌ జట్టు అవతరించింది.ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఫైనల్లో తెలుగు జట్టు 243 పరుగుల తేడాతో  విజయం సాధించి, తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.

భారీ లక్ష్యం

236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని హైదరాబాద్‌ జట్టు.. ఛత్తీస్‌గఢ్‌ ఎదుట 518 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేసించింది. ఈ భారీ ఛేదనలో రాహుల్ సింగ్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 274 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 117; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో మెరవగా.. మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, అనికేత్ రెడ్డి రెండు, రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ పడగొట్టారు. 

సంక్షిప్త స్కోర్లు 

  • హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌: 417 ఆలౌట్
  • హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌: 281 ఆలౌట్
  • ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌: 181 ఆలౌట్
  • ఛత్తీస్‌ఘడ్ రెండో ఇన్నింగ్స్‌: 274 ఆలౌట్