బహుజన్ సమాజ్ పార్టీకి (బీఎస్పీ) చెందిన ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు చాలాసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా చెప్పారు. పదే పదే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు.
గతంలో జేడీఎస్‌లో ఉన్న డానిశ్ అలీ.. 2018 కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ పొత్తులో పోటీ చేశారు. రిజల్ట్స్ తర్వాత దేవెగౌడ సూచన మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహ సీటును బీఎస్పీ కేటాయించింది. 2019లో అమ్రోహ లోక్‌సభ స్థానం నుంచి డానిశ్ అలీ గెలుపొందారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు.
అలీపై గతంలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో డానిష్ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో విపక్ష పార్టీ నేతలు ఆయనకు అండగా నిలిచారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆయనను కలిసి తన మద్దతు ప్రకటించారు. తాజాగా మహువా మొయిత్రాను సస్పెన్షన్‌ను అలీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలోనూ బీఎస్పీ పార్టీ డానిష్ అలీ తీరుపై అసంతృప్తితో ఉంది. ఇవన్నీ కారణాలతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
