రూట్ మార్చిన బీఎస్పీ.. బ్రాహ్మణ సామాజిక వర్గంపై దృష్టి

రూట్ మార్చిన బీఎస్పీ.. బ్రాహ్మణ సామాజిక వర్గంపై దృష్టి

దలిత, బహుజన వాదం ప్రధానంగా రాజకీయాలు సాగించిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ...రూట్ మారుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో వన్ ఆఫ్ ది మెజారిటీగా ఉన్న బ్రాహ్మణ వర్గం వైపు దృష్టి సారిస్తోంది. BSPలో మాయావతి తర్వాత నెంబర్ టూగా ఉన్న సతీశ్ చంద్ర మిశ్రా... బ్రాహ్మణులకు పార్టీని దగ్గర చేసే బాధ్యతలను తలకెత్తుకున్నారు. తద్వారా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సతీశ్ చంద్ర మిశ్రా. మూడు దశాబ్ధాలుగా దేశ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఉన్న అయోధ్య నుంచే కార్యక్రమాలు షురూ చేశారు. అయోధ్యలో నిన్న బ్రాహ్మణ సమావేశాలు నిర్వహించారు. BSP జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. బ్రాహ్మణ సమ్మేళనాలను ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 7 చోట్ల నిర్వహించనున్నారు. నిన్న జరిగిన సమావేశం మొదటిది కాగా... మరో 6 సమ్మేళనాలు జరగనున్నాయి. 

దళిత, బహుజనులే BSPకి సంప్రదాయ ఓటు బ్యాంక్ కాగా... బీజేపీ ప్రభంజనంతో... అది చీలిపోయింది. అయితే సంప్రదాయంగా BSPకి ఉన్న ఓట్ బ్యాంక్ తగ్గినప్పటికీ... పూర్తిగా పోయిందని చెప్పలేం. దీంతో... ఇప్పుడున్న బలానికి అదనంగా బలం సంతరించుకోవడంపై మాయావతి ఫోకస్ చేశారు. సహజంగానే ఆమె ఫోకస్ బ్రాహ్మణ ఓట్లవైపు మళ్లింది. అందుకే ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు బ్రాహ్మణ సమ్మేళన్  పేరుతో సమావేశాలు పెట్టేందుకు ప్లాన్ చేశారు. అయితే రాజకీయంగా తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయనే కారణంతో... జ్ఞానోదయ సమ్మేళనాలుగా పేరు మార్చారు. 

అయోధ్యలో మొదటి సమావేశానికి ముందు హనుమాన్ గఢీ ఆలయంలో పూజలు చేశారు సతీశ్ చంద్ర మిశ్రా. శ్రీరాముడు అందరివాడని... చెప్పుకొచ్చారు. బీజేపీ మాత్రమే మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని... తాము అలా చేయబోమని స్పష్టం చేశారు.