4 జీ విస్తరణ, అప్​గ్రెడేషన్​, అప్పులు తీర్చడం కోసమే ఈ ప్యాకేజ్​

4 జీ విస్తరణ, అప్​గ్రెడేషన్​, అప్పులు తీర్చడం కోసమే ఈ ప్యాకేజ్​

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీ బీఎస్​ఎన్​ఎల్​ రివైవల్​ కోసం రూ. 1.64 లక్షల కోట్లతో ప్యాకేజ్​ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  రాబోయే నాలుగేళ్లలో అమలయ్యే ఈ రివైవల్​ ప్యాకేజ్​కు కేబినెట్​ ఆమోదం వచ్చినట్లు టెలికం మినిస్టర్​ అశ్వని వైష్ణవ్​ చెప్పారు. సర్వీసులను అప్​గ్రేడ్​ చేయడానికి, స్పెక్ట్రమ్​ కేటాయింపు కోసం, బ్యాలెన్స్​ షీటును మెరుగుపరచడానికి ఈ తాజా క్యాపిటల్​ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత్​ బ్రాడ్​ బ్యాండ్​ నిగమ్​ లిమిటెడ్​ (బీబీఎన్​ఎల్​)ను బీఎస్​ఎన్​ఎల్​లో విలీనం చేయడానికి కూడా ఈ ఫండ్స్​ వాడొచ్చని చెప్పారు. బీఎస్​ఎన్​ఎల్​కు ఇచ్చే రూ. 1.64 లక్షల కోట్లలో రూ. 43,964 కోట్లు నగదు రూపంలో ఉంటుందని, మిగిలిన రూ. 1.2 లక్షల కోట్లను ఇతర రూపంలో ఇవ్వనున్నామని మంత్రి పేర్కొన్నారు.  4 జీ సేవలు అందించడానికి అవసరమైన స్పెక్ట్రమ్​ను కూడా బీఎస్​ఎన్​ఎల్​కు ప్రభుత్వం సమకూర్చనుందని అన్నారు. 900,1800 మెగాహెట్జ్​ బ్యాండ్​లో స్పెక్ట్రమ్​ను ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ. 44,993 కోట్లు ఖర్చవుతుంది. దీనిని ఈక్విటీ  క్యాపిటల్​ రూపంలో అందించనున్నారు. 4 జీ టెక్నాలజీ స్టాక్​ డెవలప్​మెంట్​ కోసం బీఎస్​ఎన్​ఎల్​కు రూ. 22,471 కోట్లను ఇవ్వనున్నట్లు వైష్ణవ్​ వెల్లడించారు. ఈ క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ను వచ్చే నాలుగేళ్లలో అందించనున్నట్లు పేర్కొన్నారు. మరో రూ. 13,789 కోట్లను వయబిలిటీ గ్యాప్​ ఫండింగ్​ కింద ఇస్తామన్నారు. లాభం రాని రూరల్​ వైర్​లైన్స్​ను 2014–15 నుంచి 2019–20 మధ్య కాలంలో  బీఎస్​ఎన్​ఎల్​ నిర్వహించినందుకుగాను  ఈ ఫండింగ్​ ఇస్తున్నట్లు చెప్పారు. ​బ్యాలెన్స్​ షీట్​ను పటిష్టం చేసేందుకు మరో రూ. 33,404 కోట్లను ఇచ్చి, దానిని ఈక్విటీగా మారుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడున్న అప్పులు తీర్చేందుకు కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి సావరిన్​ గ్యారంటీ ఇస్తారు. భారత్​నెట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను  మెరుగ్గా వాడుకునేందుకు బీబీఎన్​ఎల్​ను బీఎస్​ఎన్​ఎల్​లో విలీనం చేస్తారు. దేశంలోని టెలికం సర్వీస్​ ప్రొవైడర్లందరికీ ఈ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను వాడుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.