లొట్టపీసు​కేసని తెలిసినా.. విచారణకు పోయిన:కేటీఆర్​

  • లాయర్​తో వెళ్లగానే సీఎం రేవంత్​రెడ్డి భయపడ్డడు: కేటీఆర్​
  • హైకోర్టు కొట్టేసింది క్వాష్​ పిటిషనే.. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లాం
  • అణాపైసా అవినీతి చేయలే.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​ కేసు విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ ​అన్నారు. లాయర్​సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్​ వేశామని చెప్పారు.

హైకోర్టు అనుమతిస్తే ఈ నెల 9న లాయర్లతోనే ఏసీబీ విచారణకు హాజరవుతానని, 16న ఈడీ ఎంక్వైరీకి వెళ్తానని తెలిపారు.  అణాపైసా అవినీతి చేయని బిడ్డగా ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా రెడీ అని పేర్కొన్నారు. 

మంగళవారం హైదరాబాద్​ నందినగర్​లోని తన ఇంటి వద్ద మీడియాతో కేటీఆర్​ మాట్లాడారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. అవినీతి చేసినోళ్లకు, డబ్బు సంచులతో దొరికినోళ్లకు, ప్రతిపనిలో అవినీతికి పాల్పడినోళ్లకు ప్రతి పనిలో ఎంతో కొంత చేతులు మారిందన్న ధ్యాసే ఉంటుందని పరోక్షంగా కాంగ్రెస్​ నేతలను విమర్శించారు. 

అందుకే ఫార్ములా –ఈ  రేస్​ విషయంలో ఏదో జరిగిందంటూ కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతున్నారని, కానీ, అదేమీ లేని లొట్టపీసు కేసు అని పేర్కొన్నారు. అయినా కూడా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవంగా వెళ్లానని చెప్పారు. 

ఈ లొట్టపీసు కేసుపెట్టి చిట్టినాయుడు (రేవంత్) శునకానందం, పైశాచికానందం పొందుతున్నారని, ఏసీబీ విచారణకు లాయర్​తో వస్తానని చెప్పే తీసుకెళ్లానని, 45 నిమిషాలు అక్కడే ఉన్నానని, సీఎం రేవంత్​ భయపడ్డారని అన్నారు. 

నేను తప్పుచేసినట్టు హైకోర్టు చెప్పలే

ప్రభుత్వం పెట్టిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని మాత్రమే హైకోర్టు చెప్పింది తప్ప.. తనకేమీ శిక్ష వేయలేదని, తప్పు చేశానని చెప్పలేదని కేటీఆర్​అన్నారు.  ‘‘ఏసీబీ పెట్టింది అక్రమ కేసు, తప్పుడు ఎఫ్ఐఆర్​ అని హైకోర్టులో పిటిషన్​ వేశాం.

 న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్వాష్​ పిటిషన్​నే కోర్టు కొట్టేసింది.  మేం దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాం. రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల్లోనో తీర్పు వస్తుంది. 

నాకు న్న హక్కుల మేరకు లాయర్​ను తీసుకెళ్లాను’’ అని పేర్కొన్నారు. వంద శాతం ధర్మం, న్యాయం గెలుస్తుందని అన్నారు. నాలుగేండ్లలో తమపై మరిన్ని కేసులు పెడతారని ఆరోపించారు. 

మేఘా సంస్థ మాకూ విరాళాలిచ్చింది

మేఘా సంస్థ తమకు కూడా విరాళాలిచ్చిందని, తమతోపాటు కాంగ్రెస్​, బీజేపీలకూ ఇచ్చిందని కేటీఆర్​ అన్నారు. మల్లన్నసాగర్​ నుంచి హైదరాబాద్​కు తాగునీటిని తరలించే రూ.4 వేల కోట్ల ప్రాజెక్టును మేఘాకే ఇస్తున్నట్టు తెలిసిందని అన్నారు. 

మూసీ శుద్ధి ప్రాజెక్టునూ ఆ సంస్థకే ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయని తెలిపారు. సుంకిశాల ఘటన తర్వాత మేఘా ఇంజినీరింగ్​ సంస్థను బ్లాక్​లిస్ట్​లో పెట్టాలంటూ హైదరాబాద్​ మున్సిపల్​ వాటర్​ సప్లై అండ్​ సివరేజ్​ సిఫార్సు చేసిందని, మరి ఆ సంస్థను  ప్రభుత్వం ఎందుకు బ్లాక్​లిస్టులో పెట్టట్లేదని నిలదీశారు.

మంత్రులే జడ్జిలైతున్నరు

కొందరు మంత్రులు వాళ్లే జడ్జిలైపోయి తీర్పులు చెప్తున్నారని, శిక్షలు వేస్తున్నారని కేటీఆర్​ అన్నారు.  తన హక్కుల కోసం ఎన్ని కోర్టులకైనా పోతానని, మంత్రులకు ఏం కడుపునొప్పి అని ప్రశ్నించారు. 

‘‘విచారణ మీడియాలోనో, సెక్రటేరియెట్​లోనో లేదంటే మంత్రుల పేషీల్లోనో జరగదు. కోర్టుల్లోనే విచారణ జరుగుతుంది. అందుకే మేం అక్కడికే వెళ్తున్నాం.  ఫార్ములా– ఈ రేస్​లో రూపాయి అవినీతి కూడా జరగలేదు. 

 ఈవీలకు హైదరాబాద్​ను కేంద్రంగా నిలిపేందుకే ప్రయత్నించాం తప్ప.. కాంగ్రెస్​ వాళ్లలాగా నికృష్టపు పనులు చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు. 

మీడియాపై ఆగ్రహం

బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తన ఫ్రస్ట్రేషన్​ను మీడియాపై చూపించారు. అడ్వర్టైజ్​మెంట్ల కోసం సీఎంవో లీకులను ఇష్టమొచ్చినట్టు రాస్తారా? అని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా అని, ఒక స్తంభం అబద్ధాలు, దాగుడుమూతలు ఆడుతుంటే.. అర్ధసత్యాలను ప్రచారం చేస్తుంటే ఫ్యాక్ట్​ చెక్​ చేసుకోకుంటే తప్పు కాదా? అని ప్రశ్నించారు. 

మీడియా వాళ్లు కూడా ఆగం కావొద్దని, సీఎం నోటి నుంచి వచ్చేవన్నీ వేదవాక్కులు కావని, సీఎంవో నుంచి వచ్చే లీకులన్నీ నిజాలూ కావని పేర్కొన్నారు.