పెట్టుబడులు పెట్టినోళ్లను జైల్లో వేస్తామంటే ఎలా? : కేటీఆర్​

  • ఎల్‌ అండ్‌ టీ సీఎఫ్‌వోపై రేవంత్‌ వ్యాఖ్యలు దిగజారిన మానసిక స్థితికి నిదర్శనం: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగడం సరైంది కాదని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పరిశ్రమలకు సీఎం రేవంత్ ఎలాంటి సందేశం పంపుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం నిర్వహించిన ‘ఆజ్ తక్ కాన్‌క్లేవ్‌’లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో సీఎఫ్‌వోను లోపలేయమన్న అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు.

కంపెనీ కార్యకలాపాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రభావాన్ని వెల్లడించినందుకు ఎల్ అండ్ టీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను జైలుకు పంపిస్తానంటూ ఏ సీఎం కూడా మాట్లాడరని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే.. దిగజారిన ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించాక, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉన్నట్టుందన్నారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు వారి పార్టీ సీఎంలకు రాహుల్ గాంధీ నేర్పించిన గొప్ప వ్యూహం ఇదేనా అని కేటీఆర్‌‌ ప్రశ్నించారు. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నదని మరో ట్వీట్‌లో కేటీఆర్ విమర్శించారు. పదేండ్ల పాటు అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా దూసుకెళ్లిన తెలంగాణ రాష్ట్రం.. ప్రస్తుతం అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతి కలగలిసిన రేవంత్ పాలనలో అన్ని రంగాల్లోనూ తిరోగమిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తగ్గిపోయిందన్నారు. మన పొరుగున ఉన్న 5 రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 శాతం నుంచి 32 శాతం వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ ఒక్కటే గతేడాది కన్నా తక్కువ వృద్ధిని నమోదు చేసిందని, ప్రభుత్వ వైఫల్యానికి ఈ లెక్కలే నిదర్శనమన్నారు.