నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్

  • సీఎం రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్​ సవాల్​
  • 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్​మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తరు 
  • బంగారం, పెన్షన్​ కోసమే కాంగ్రెస్​కు ప్రజలు ఓట్లేసిన్రు
  • కేసీఆర్​ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నరు
  • ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్‍, బీజేపీ కుమ్మక్కైనయ్‍ 
  • అక్షింతలు పంచి బీజేపీ ఓట్లడుగుతున్నది 
  • పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నరు
  • అలంపూర్, వరంగల్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ 

గద్వాల/అలంపూర్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి మగాడైతే  ఆగస్టు 15న రూ. రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​ సవాల్​ విసిరారు. ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 8–10  సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్​ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్​ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్​ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మంగళవారం కేటీఆర్​ గద్వాల జిల్లా అలంపూర్​లో నిర్వహించిన  బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్​లో,  వరంగల్‍ బీఆర్‍ఎస్‍ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్‍కుమార్‍ తరఫున వరంగల్‍ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు.  

‘సీఎం రేవంత్ మగాడైతే రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేయాలి.. రూ.2 వేల పెన్షన్​ను రూ.4 వేలు చేయాలి.. ప్రతి ఆడ బిడ్డకు రూ.2,500 ఇయ్యాలి’ అని కేటీఆర్​ సవాల్​ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14  సీట్లలో  వెంట్రుక వాసిలో ఓటమి చెందామని  అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వంద రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్​ను ఇక్కడ, తన చెల్లె కవితను మోదీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని  అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దపెద్ద పదవుల్లో అధికారం అనుభవించిన వాళ్లు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ హోదా కల్పిస్తామని, పబ్లిక్ కమిషన్ చైర్మన్ చేస్తామని చెప్పినా వాటన్నింటినీ కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్​డ్​​ స్థానాలు ఉన్నాయని, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ లో ఎక్కడి నుంచి  పోటీలో నిలబడినా  డబ్బులు తామే ఖర్చు పెడతామని చెప్పి ఆర్ఎస్పీకి  టికెట్ ఇచ్చామన్నారు. ‘ ఇప్పుడు ఆయన నాటి ఆర్ఎస్పీ కాదు.. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.  గతం గతః. అన్నీ వదిలిపెట్టండి. ఆయనను గెలిపించండి.’ అని పార్టీ శ్రేణులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు.

సినిమా సీక్వెల్​లా మోసాలు 

సినిమా సీక్వెల్​లా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘ఈ మధ్య సినిమాలు పార్ట్ వన్.. పార్ట్ టూ వస్తున్నాయి. అందరూ బాహుబలి –1, బాహుబలి –2 చూసి ఉంటారు కదా. అదే పద్ధతిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. మళ్లీ ఇప్పుడు పార్ట్ –2లో మాదిరిగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాక ఆగస్టు నెలలో రెండు లక్షలు మాఫీ చేస్తా అని కొత్త పల్లవి అందుకున్నార’ని ఎద్దేవా చేశారు. 

అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్నరు

‘రాముడు అందరివాడు. బీజేపీ వాడు కాదు. కానీ అక్షింతలు పంచి మోదీ, బీజేపీ ఓట్లు అడగడం దుర్మార్గం’ అని కేటీఆర్​ అన్నారు. పదేండ్లలో బీజేపీ ఒక్క పనైనా చేసిందా? అని నిలదీశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని అడిగితే ఒక లెటర్ కూడా రాయలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో  జన్ ధన్ ఖాతాలు తెరిస్తే 15 లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్కూలు, మెడికల్ కాలేజీ ఇవ్వని దుర్మార్గుడు మోదీ అని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణను మోసం చేశాయని, గులాబీ కండువే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  

కావ్య పొద్దున గొప్పలు చెప్పింది..సాయంత్రం వెళ్లిపోయింది

కడియం శ్రీహరి 2013లో పార్టీలో చేరితే సీఎం తర్వాత ఉండే అన్ని పదవులు ఇచ్చామని కేటీఆర్​ అన్నారు. ఆయన కూతురు కావ్యకు పార్టీ ఎంపీ టికెట్‍ ఇచ్చాక కుటుంబంతో కలిసి కేసీఆర్‍తో భోజనం చేసి అందరికంటే ఎక్కువ సాయం అడిగారని పేర్కొన్నారు. కడియం కావ్య సైతం పొద్దున థ్యాంక్స్​ చెప్పడానికి ఫోన్‍ చేసిందని, సాయంత్రం ఉత్తరంలో మేం రాజీనామా చేసి పోతున్నామంటూ జెండా ఎత్తేసి పారిపోయిందని విమర్శించారు. కడియం విశ్వాస ఘాతకుడని, నమ్మించి గొంతు కోసుడు బరాబర్​ తప్పని అన్నారు.

డీఎన్ఏ టెస్ట్ ​చేస్తే కడియం కులం బయటపడ్తది: రాజయ్య

‘‘కడియం శ్రీహరి.. నీ అయ్యపేరు ఏంటో చెబితే దేనికైనా సై. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎలా పుట్టావో.  నీ అన్నదమ్ములకు డీఎన్‍ఏ టెస్ట్​ చేస్తే నీ కులం ఏంటో బయటపడ్తది” అని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. ‘‘నాకు వద్దని ఊంచితే వచ్చిన పదవులు నీవి” అని శ్రీహరిని విమర్శించారు. కడియం శ్రీహరికి కుబేరుడి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.  

బీజేపీ పెద్ద లీడర్లను ఓడించింది మేమే

రాష్ట్రంలో బీజేపీ పెద్ద లీడర్లను ఓడించిన ఘనత బీఆర్‍ఎస్‍ పార్టీదేనని కేటీఆర్​ తెలిపారు. బండి సంజయ్‍, ఈటల రాజేందర్, రఘునందన్‍రావు, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్​ను తామే ఓడించామని చెప్పారు.  రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదామని నినదించారు. పార్లమెంట్‍ ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏలకు కావాల్సిన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెడితే అటు ఢిల్లీలో.. ఇటు తెలంగాణలో కేసీఆర్‍ తన ప్రతాపం చూపుతారని పేర్కొన్నారు.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు కొందరు బంగారం కోసం.. మరికొందరు పెన్షన్‍ కోసం కాంగ్రెస్‍ పార్టీకి ఓట్లు వేశారన్నారు. హామీ ఇచ్చిన రేవంత్‍రెడ్డికి తులం బంగారం దొరుకుతదా? లేదా? అని ప్రశ్నించారు.