మాకు టైమొచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తం..మీడియాకు కేటీఆర్​ బెదిరింపులు

  • సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నరు
  • అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడ్తున్నరో రాసిపెట్టుకుంటున్న
  • అధికారంలోకి వచ్చినంక అందరికీ మిత్తితో చెల్లిస్తం
  • నన్ను జైలుకు పంపాలని రేవంత్​ చూస్తున్నడు
  • కేంద్రంలో కేసీఆర్​ చక్రం తిప్పేరోజు ముందుంది
  • ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వ్యాఖ్య

రాజన్నసిరిసిల్ల, వెలుగు : మీడియాపై బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​ బెదిరింపులకు దిగారు. తమకు టైమ్​ వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. వాడూ వీడు అంటూ కామెంట్లు చేశారు. సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయంటూ పేపర్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారని.. తమ పై కొందరు కేసులు పెట్టించి పైశాచికానందం పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో  రాసిపెట్టుకుంటున్నానని.. బీఆర్​ఎస్​ నేతలు కూడా అన్నీ రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చినంక అందరికీ మిత్తీతో చెల్లిస్తామని హెచ్చరించారు.

‘‘సిరిసిల్లలో బీఆర్ఎస్​ నేతలు ఎలాంటి భూ కుంభకోణం  లంభకోణం చేయలేదు.. ఎవనికీ భయపడాల్సిన అవసరం లేదు.. ఏ గాడిద కొడుకు మనల్ని పీకేది ఏమీలేదు.. మీకు అండగా నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఉంది. కింద న్యాయస్థానం ఉంది. పైన దేవుడున్నాడు’’ అని పార్టీ నేతలకు చెప్పారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన బీఆర్​ఎస్ కార్యకర్తలో సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. ‘'ఇవ్వాళ ఏం రాసిండు పేపరోడు.. సిరిసిల్లలో ఏదో భారీ కుంభకోణం అట. నీ బొంద కుంభకోణం. ఏ కుంభకోణం జరగలే.

ALSO READ : జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఒక్కరో, ఇద్దరో హౌలేగాళ్లు.. అధికారం వచ్చిందని రెండు, మూడు కేసులు పెట్టించి పైశాచికానందం పొందుతామని అనుకుంటున్నరు” అని దుయ్యబట్టారు. పేపర్లలో తాటికాయంత అక్షరాలతో వార్తలు చూసి ఆగం కావొద్దని, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని, వాటిని అప్పుడప్పుడు చూడండని కార్యకర్తలకు చెప్పారు.