పునరావాసం కల్పించిన తర్వాతే మూసీ పనులు ప్రారంభించాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. శాసన మండలిలో చర్చ అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అన్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి 4100 కోట్లు కావాలని కోరిన సంగతి వాస్తవమా కాదా చెప్పాలని అన్నారు. ప్రభుత్వం డీపీఆర్ తయారు కాలేదని సభలో చెప్పిందని తెలిపారు. 

మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అన్నారు. మూసీ సుందరీకరణతో పేదల ఇల్లు పోతాయిని భావించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఆపేశారని తెలిపారు. ఎస్టీపిలు ఏర్పాటు చేసి మంచి నీటిని మూసీలో పారించాలని భవించినట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Also Read :- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలే

బీఆర్ఎస్ మరో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణలో భాగంగా ఎస్టీపిలు ఏర్పాటు చేశామని, తాము మూసీకి వ్యతిరేఖం కాదని కేవలం దోపిడీకి వ్యతిరేకం అని అన్నారు. పేదల ఇళ్లకు బుల్డోజర్లు పంపిస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. గిరిజన రైతులను రాష్ట్రప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని ఓడించాడని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. 

ఇక మండలి ప్రతిపక్ష నేత, మధుసూదన చారి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి భూదాహం రైతులకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. రైతాంగానికి న్యాయం జరగాలని, అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో రైతులకు సంబంధించి వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని.. రైతులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 
గత ఏడాది కాలంగా గురుకుల విద్యార్థుల ఆహాకారాలతో తెలంగాణ మార్మోగుతుందని, వారి భవిష్యత్ కి భరోసా ఇవ్వాలని ఆడిగితే దాటవేస్తున్నారని విమర్శించారు. గురుకులాల విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, వాస్తవాలు గ్రహించి విద్యార్థులకు న్యాయాలని సూచించారు.