తెలంగాణ తల్లి విగ్రహానికి గెజిట్ ఇవ్వడం దారుణం :ఎమ్మెల్సీ కవిత 

  • ఎన్నికలు ఉన్నప్పుడే కాంగ్రెసోళ్లకు బతుకమ్మ గుర్తొస్తది: ఎమ్మెల్సీ కవిత 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని రాష్ట్ర సర్కార్‌‌ను బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సర్కార్‌‌ గెజిట్‌ ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. దేశంలో భరతమాత విగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? అని ప్రశ్నించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏనాడూ భరతమాతపై గెజిట్ ఇవ్వలేదు.. కానీ, రాష్ట్రంలో మాత్రం కొత్త విగ్రహాన్ని పెట్టి అందరూ అదే విగ్రహాన్ని పెట్టాలి.. వేరే విగ్రహం పెడితే కేసులు పెడ్తామంటూ గెజిట్ ఇవ్వడం దారుణమన్నారు.

ఎన్ని జీవోలిచ్చినా.. ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్రంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహలను ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఏ శిక్ష వేస్తారని ప్రశ్నించారు.