- పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
- బంజారాహిల్స్ పీఎస్‌లో అనుచరులతో కలిసి హల్చల్
- ఫోన్ ట్యాప్ అవుతున్నదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్
- అదే టైమ్‌లో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్లబోతున్న సీఐ
- అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి
- ‘‘నేను ఎమ్మెల్యేను.. నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేది?’’ అంటూ చిందులు
- డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసు
- పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రుబాబు
జూబ్లీహిల్స్, వెలుగు: హుజూరాబాద్ బీఆర్ఎస్ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రెచ్చిపోయారు. బంజారాహిల్స్ పోలీసులపై రుబాబు చూపెట్టారు. సుమారు 20 మంది అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. హల్చల్ చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేను. మీకు ప్రొటోకాల్ పాటించడం తెలియదా? వచ్చేది మా సర్కారే.. మీ అందరి పని చెప్త” అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. తన ఫోన్‌ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పాడి కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
ఆ టైంలో సీఐ రాఘవేంద్ర డ్యూటీపై బయటకు వెళ్లడానికి వాహనం ఎక్కబోతున్నారు. అప్పుడే లోపలికి ప్రవేశించిన కౌశిక్‌రెడ్డి సరాసరి సీఐ దగ్గరికి వెళ్లారు. తాను కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చానని, ఎక్కడికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. డ్యూటీపై వెళ్తున్నానని, వెంటనే వస్తానని సీఐ బదులిచ్చారు. అయినా వినకుండా.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాతే వెళ్లాలని కౌశిక్‌రెడ్డి పట్టుబట్టారు. అనుచరులతో కలిసి సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు. వెళ్లనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. చివరికి సీఐ రాఘవేంద్ర పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లగా.. ఆయన వెంటే కౌశిక్‌రెడ్డితో పాటు అనుచరులు లోపలికి వెళ్లారు.
నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేది?
సీఐతో ఆయన చాంబర్లోకి వెళ్లిన కౌశిక్‌రెడ్డి.. ‘‘నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి, ఐజీ శివధర్‌రెడ్డి ప్రమేయంతోనే జరుగుతున్నట్టు నమ్ముతున్న. వాళ్లపై ఎఫ్ఐఆర్నమోదు చేయాలి’’ అని అన్నారు. ‘‘కంప్లయింట్ఇద్దామని వస్తే ఏసీపీ వెంకట్‌రెడ్డి లేకపోవడం ఏమిటి? నేను వస్తానని చెప్తే మధ్యాహ్నం రమ్మన్నడు. తీరావస్తే ఆయన లేడు. మీరు కూడా వెళ్లిపోతుంటే ఏమని అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే అయిన నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేది? వచ్చేది మా ప్రభుత్వమే ..అప్పుడు చెప్త అందరి పని!’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఫిర్యాదు ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్తీసుకుని వెళ్లిపోయాడు.
కౌశిక్‌రెడ్డిపై కేసు
ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి పోలీసులను బెదిరించారని, డ్యూటీకి ఆటంకం కలిగించారని, దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు.