విచారణకు కౌశిక్‌‌‌‌రెడ్డి రాలే

  • వచ్చేనెల 6న హాజరుకావాలని పోలీసుల ఆదేశం
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎంక్వైరీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరుకాలేదు. బంజారాహిల్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్ రాఘవేంద్ర విధులకు ఆటంకం కలిగించిన కేసులో శుక్రవారం మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కౌశిక్​రెడ్డికి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రికి గుండె ఆపరేషన్ ఉన్నందుకు రాలేక పోతున్నట్టు ఆయన సమాచారం అందించారు. దీంతో వచ్చే నెల 6న హాజరుకావాలని కౌశిక్​రెడ్డికి మాసబ్‌‌‌‌ట్యాంక్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ పరశురాం సూచించారు. 

ఈ నెల4 న కౌశిక్​రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ‌‌‌‌రాఘవేంద్రతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ‌‌‌‌వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

కౌశిక్ రెడ్డిని ఈ నెల 6న అరెస్ట్ చేశారు. రాఘవేంద్ర ఫిర్యాదుదారుడు కావడంతో.. మాసబ్‌‌‌‌ట్యాంక్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌పరశురాం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌‌‌ను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బెయిల్‌‌‌‌ మంజూరు చేయడంతో ఆయనను విడుదల చేశారు.