కేసీఆర్​ నిర్ణయాన్నే అమలు చేశారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే  కేపీ వివేకానంద్​

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ మెట్రోపై కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్నే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్​లో మరో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి కేసీఆర్​ప్రభుత్వం మెట్రో మూడోదశ విస్తరణపై కన్సల్టెంట్​నూ నియమించిందని, కానీ, రేవంత్​ అధికారంలోకి రాగానే కేసీఆర్ ​ఆనవాళ్లు చెరిపేయాలన్న ఉద్దేశంతో మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేశారని విమర్శించారు. ఏడాది పాలనలో రేవంత్ తీసుకున్న​ నిర్ణయాలన్ని తిరోగమన చర్యలేనని మండిపడ్డారు. ఏడాది నుంచి శామీర్ పేట, మేడ్చల్ వరకు మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి మీనమేషాలు లెక్కించారని చెప్పారు.