- సీఎం రేవంత్ ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: కంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.400 బోనస్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5 లక్షల టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కందులకు బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనూ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
కందులకు మద్దతు ధర రూ.7550 ఉన్నా.. బహిరంగ మార్కెట్లో రూ.6500 నుంచి రూ.6800కే వ్యాపారులు కొంటున్నారని తెలిపారు. క్వింటాల్‌పై రైతులకు రూ.800 వరకు నష్టం వస్తున్నదని చెప్పారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వెంటనే కందుల కొనుగోళ్లను ప్రారంభించాలని, బోనస్‌గా చెల్లించాలని డిమాండ్ చేశారు.