స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్​ సింగ్​ పేరు పెట్టాలి :ఎమ్మెల్యే హరీశ్​ రావు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్​ఎస్​ మద్దతు: ఎమ్మెల్యే హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు సూచించారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై హరీశ్​రావు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంతాప తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నామని ప్రకటించారు. మన్మోహన్ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని సభలో పెట్టిన తీర్మానాన్ని సమర్థించారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని ఇదే సభలో కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, వారికి భారతరత్న ఇచ్చారన్నారు.

మన్మోహన్​ సింగ్​కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని  ప్రకటించారు. రాజ్య సభలో 33 ఏండ్లు పనిచేశారని, ఇక్కడ పెద్దల సభ శాసనమండలిలో కూడా వారికి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు. పీవీ తన కేబినెట్​లో మన్మోహన్ సింగ్​ను ఆర్థికశాఖ మంత్రిగా తీసుకున్నారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థికరంగానికి తనదైన శైలిలో దశ దిశను చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. మన్మోహన్ మిక్స్ అనే స్థాయికి దేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేశారన్నారు. యూపీఏ -2లో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగాయని.. కానీ, మన్మోహన్ సింగ్​పై ఒక చిన్న ఆరోపణ కూడా రాలేదని చెప్పారు.

అడ్మినిస్ట్రేటర్​గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నపుడు, తెలంగాణ ఏర్పాటు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరీంనగర్ సభలో ప్రకటన చేశారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అప్పుడు మన్మోహన్ సింగ్ పిలిచి కేంద్ర కేబినెట్​లో చేరాలని కేసీఆర్​ను అడిగారన్నారు. అయితే, తెలంగాణ ఏర్పాటుతో పాటు కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని కోరిన తర్వాతే కేబినెట్​లో చేరేందుకు అంగీకరించారని గుర్తుచేశారు.