రోడ్లు ఎప్పుడేస్తరు.. పరిహారం ఎప్పుడిస్తరు .. ధర్నా చేసిన బీఆర్​ఎస్ ​నేతల

  • బీఆర్​ఎస్ ​నేతల రాస్తారోకో అరెస్ట్ చేసిన పోలీసులు

పెబ్బేరు, వెలుగు: రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారినా ఎందుకు రిపేర్లు చేస్తలేరని, ఇండ్లు కూలగొట్టుకున్న బాధితులకు నష్టపరిహారం ఎప్పుడిస్తారని పెబ్బేరు మున్సిపల్​పాలకవర్గం, బీఆర్ఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. గురువారం ఉమ్మడి పెబ్బేరు మండల బీఆర్ఎస్​నేతలు పెబ్బేరు సుభాష్​చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. పెబ్బేరు–వనపర్తి రోడ్డు నిర్మాణానికి నిధులున్నా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. 

సుభాష్​చౌక్​నుంచి అంబేడ్కర్​కాలనీ వరకు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, కరెంట్​ఫోల్స్​షిఫ్టింగ్ కోసం నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటి ఆమోదానికి పాలకవర్గం తీర్మానాలు కూడా చేసిందని అన్నారు. పలుమార్లు మంత్రి జూపల్లి కృష్ణారావుకు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి, కలెక్టర్​కు, ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. గెలిచిన వెంటనే రోడ్లు నిర్మిస్తామని మాటిచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఫైర్​అయ్యారు. ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్​చేశారు. 

పోలీసుల అరెస్ట్​

ధర్నా కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎస్సై హరిప్రసాద్​రెడ్డి, పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. మున్సిపల్​ఛైర్​పర్సన్​కరుణశ్రీ, వైస్​చైర్మన్​కర్రెస్వామి, కౌన్సిలర్లు పార్వతి, సుమతి, చిన్న ఎల్లారెడ్డి, గోపిబాబు, రామకృష్ణ, నేతలు దిలీప్​రెడ్డి, వనం రాములు, సాయినాథ్, వెంకటేశ్ తదితరులున్నారు.