సీఎం గురించి మాట్లాడే హక్కు లేదు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్​ నాయకులకు లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పదవులు పోయి 10 నెలలు కాకముందే  కారు కూతలు కూసే నాయకులు ముందుగా ఆసుపత్రుల్లో చేరి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో నియోజకవర్గంలోని 592 మందికి సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం ఖాయమని, ప్రజావేదికలపై ప్రసంగాలు చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావన్నారు.  రుణమాఫీ చేస్తామని పదేండ్లు కాలయాపన చేసి రైతులను మోసం చేసింది బీఆర్ఎస్​ పార్టీ నాయకులదేనన్నారు.

అన్ని  వనరులు ఉన్న రాష్ట్రాన్ని రూ.7.12 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీటింగుల్లో రైతులతో చేతులెత్తించడం కాదని, దమ్ముంటే రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్​ చేశారు. శ్రీనివాస్​గౌడ్, కిచ్చారెడ్డి, శంకర్​ప్రసాద్, మహేశ్, బ్రహ్మచారి పాల్గొన్నారు.