- లగచర్ల బేడీల ఘటన, ప్రివిలేజ్ మోషన్‌పై చర్చించాలని పట్టు
- నల్లరంగు బట్టలు వేసుకుని సభలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- చేతులకు బేడీలు వేసుకొని ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యేలు
- లంచ్ బ్రేక్ తర్వాత సభలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన నేతలు
- మండలి చైర్మన్, స్పీకర్ వారించినా వినిపించుకోని గులాబీ లీడర్లు
- బీఆర్ఎస్ నేతలకు తోడు వెల్‌లోకి బీజేపీ ఎమ్మెల్యేలు
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
- సభ జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డ ప్రతిపక్ష నేతలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో రచ్చ చేశారు. శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మండ లిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆందోళనలకు దిగారు. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ లోపల, బయట నిరసన చేపట్టారు. అలాగే, తాము ప్రవేశపెట్టిన ప్రివిలేజ్మోషన్పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సభ జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. పొద్దున సభను నడవనిచ్చినా లంచ్‌బ్రేక్ తర్వాత నిరసనలతో హోరెత్తించారు.
సభ్యులు మాట్లాడుతున్నా.. కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టినా.. పట్టించుకోకుండా అరుపులు, కేకలతో గోల చేశారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభానికి ముందు ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా.. లగచర్ల ఘటనకు నిరసనగా నల్లరంగు బట్టలు వేసుకుని వచ్చారు. ఎమ్మెల్యేలు చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ఎల్పీ నుంచి సభకు బయల్దేరారు. ఒక్క కేటీఆర్, హరీశ్‌రావు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా చేతులకు బేడీలతోనే సభలోకి వెళ్లారు. ఇటు మండలిలోనూ ఎమ్మెల్సీలు లగచర్ల ఘటనపై నిరసన చేపట్టారు. నల్లరంగు బట్టలతో ర్యాలీగా మండలికి వెళ్లారు.
వెల్‌లోకి దూసుకెళ్లిన నేతలు
లంచ్‌తర్వాత సభ ప్రారంభమవ్వగానే.. లగచర్ల ఘట నపై చర్చించాల్సిందిగా మండలి, శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కీలకమైన బిల్లులు పాస్ చేయాల్సి ఉండడంతో తర్వాత చర్చిద్దామని మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. లగచర్ల ఘటనపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ వెల్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. మంత్రి శ్రీధర్‌బాబు సభలో మాట్లాడుతుండగానే.. బీఆర్ఎస్ నేతలు పెద్దగా అరుస్తూ నినాదాలు చేశారు.
లగచర్ల ఘటన జరిగింది స్పీకర్ సొంత జిల్లా వికారాబాద్లోనేనని, వికారాబాద్ ప్రజలు చూస్తున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో సభలో మార్షల్స్‌ను మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తోడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా.. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి వెళ్లారు. దీంతో సభ కొంత ఉద్రిక్తంగా మారింది.
సభను పార్క్‌లా మార్చేశారు: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వెల్‌లోకి దూసుకెళ్లిన అనంతరం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎత్తుకుని నినాదాలు చేశారు. బిల్లులు పాస్ అవుతున్న క్రమంలో గులాబీ ఎమ్మెల్యేలంతా గట్టిగా అరిచారు. ఈ క్రమంలోనే టూరిజం పాలసీపై షార్ట్ డిస్కషన్లో మాట్లాడిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సభ్యుడిని మరొక సభ్యుడు ఎత్తుకుని నినాదాలు చేస్తూ.. సభను పార్క్‌లా మార్చేశారని మండిపడ్డారు.
అసెంబ్లీ అంటే వారికి పార్క్‌లాగా కనిపిస్తున్నదని, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 20 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నేతలు.. స్పీకర్‌ను బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. వారి హయాంలో రైతులను నట్టేట ముంచిన బీఆర్ఎస్ లీడర్లు.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక, ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోటీగా కాంగ్రెస్ నేతలూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటన ఫొటోలను ప్రదర్శించారు.
మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన
మండలిలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. లంచ్ బ్రేక్ తర్వాత సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, ఎల్. రమణ తదితరులు నిరసన తెలియజేశారు. లగచర్ల రైతుల అరెస్టుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని, వెల్ లోకి దూసుకొచ్చి.. లగచర్ల రైతులకు మద్దుతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారించినా వినిపించుకోకుండా నినాదాలు చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెద్దల సభలో గౌరవంగా, సభ ఔన్నత్యం తగ్గకుండా చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులకు సూచించారు. బీఏసీ సమావేశంలో వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై చర్చకు నిర్ణయించామని, ఆ సందర్భంలో లగచర్లపై కూడా చర్చిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు చెప్పారు. అయినా వినిపించుకోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ నిరసనను కొనసాగించారు. చెప్పినా వినిపించుకోకపోవడంతో చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద కూడా ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.
మంత్రి సీతక్క కౌంటర్
సభలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. వారి హయాంలో ఖమ్మంలో గిరిజన రైతులు, ఆదిలాబాద్‌లో గిరిజన మహిళలు, హుస్నాబాద్, భువనగిరిలో రైతులకు బేడీలు వేసిన ఘటనలను బీఆర్ఎస్ నేతలు మరచిపోయారా? అని నిలదీశారు.
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి.. వెంటనే దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఘటనలపై నాటి సీఎం కేసీఆర్ కనీసం స్పందించారా? చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు.