బీఆర్ఎస్ నేతలకు ఇంతలోనే అంత తొందరా?

మొన్నామధ్య సాయంకాలం ఒక ఫంక్షన్‌‌కి పలు పార్టీల నేతలు చాలామందే హాజరయ్యారు.  నాయకులు ఉన్న చోట రాజకీయాల మీద పిచ్చాపాటీ చర్చ సహజమే. వర్తమాన రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ‘ఇప్పటి నుంచే రోడ్డెక్కి కొట్లాడటం మొదలుపెడితే ఇంకా నాలుగేళ్లపాటు అలసిపోతారు. ఇక కేసులూ గట్రా పెడితే, మరిన్ని చిక్కులు ఉండనే ఉంటాయి. కాస్త వేచిచూడొచ్చుగా’ అని ప్రధాన ప్రతిపక్షానికి ఓ పెద్దమనిషి  ఇచ్చిన సలహా.  ఆ పెద్దమనిషి మాటకు ప్రధాన విపక్ష పార్టీ నాయకుడు అడ్డొస్తూ.. ‘ మా పెద్ద సారూ మా యువనేతలకు సరిగ్గా ఈ మాటే చెప్పి..ఆగమంటున్నాడు. కాకపోతే మా వాళ్లు వింటేగా’ అని నిర్వేదంగా అన్నాడు. ఇక.. ఈ చర్చ అలా హాట్ హాట్‌‌గానే సాగిపోగా, నాకు మాత్రం పదేళ్ల పాలన మరోసారి కళ్లముందు కనబడింది. దానితోబాటు విపక్ష వాదనలోని డొల్లతనమూ కొట్టొచ్చినట్లు కనిపించింది. 

నేటి అధికార పార్టీ అలవి కాని హామీలిచ్చి, ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించే విపక్షం, అంతకు ముందు దాదాపు పదేళ్లు తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని పది నెలలకే ఇంత సౌకర్యవంతంగా మర్చిపోతోందని గుర్తుకొస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలతో బాటు 2018 ముందస్తు ఎన్నికలతో బాటు తర్వాత తెలంగాణలో జరిగిన పలు ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలూ గుర్తుకొచ్చాయి. వాటిలో నాడు ఆ పార్టీ ఎన్నింటిని పూర్తిగా అమలు చేసిందనేదీ కళ్లముందు సాక్షాత్కరించింది. తెలంగాణ వచ్చేనాటికి ఉన్న అప్పు ఎంత? పదేళ్ల తమ హయాంలో అది ఎంత పెరిగింది? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదేళ్లలో ఎందుకు తలకిందులై పోయిందో పదేళ్లు పాలించిన ఆ పార్టీగానీ, ఆ పార్టీ నేతలు గానీ నిజాయితీగా ఆత్మవిమర్శ ఎందుకు చేసుకోలేకపోతున్నారనే బాధా కలిగింది.

ప్రాధాన్యాలు పట్టలే

గత దశాబ్ద కాలంలో తారుమారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి ఇతర పార్టీలు ప్రశ్నించినప్పుడల్లా ‘ మా హయాంలో అప్పులు పెరిగినా, ఆ మేర ఆస్తులూ ఏర్పరచాం’ అంటూ ఎదురుదాడిచేస్తున్న నేతల జాణతనం, దీనితో ముడిపడిన ఓ ఉదాహరణా గుర్తుకొచ్చాయి. ఇల్లు ప్రాథమిక అవసరమనే ఉద్దేశంతో నేడు మెజారిటీ ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్లు బ్యాంకులో అప్పు తీసుకుని ఇల్లు కొంటున్నారు. అయితే, ఇల్లు నీడనివ్వటానికి, సమాజంలో కాస్త హోదా పెంచటానికీ తప్ప అది దానంతట ఎలాంటి ఆదాయాన్ని సృష్టించే వనరు కాదని కొనేవారికి స్పష్టంగా తెలుసు. అంతేకాదు.. తిన్నా తినక పోయినా, చచ్చినట్లుగా నెల తిరిగేసరికి నెలవారీ కిస్తీలు బ్యాంకు వాడికి కట్టి తీరాల్సిందేనని, బాకీ తీరే దాకా అది బ్యాంకు తనఖాలోనే ఉంటుందని తెలిసి కూడా ఇల్లు ఒక అవసరం గనుక ఏర్పరుచుకుంటుంటారు. మరి.. పదేళ్ల పాలనలో అవసరాలను, తెలంగాణ సమాజపు వాస్తవ ప్రాధాన్యతలను పక్కనబెట్టి, అడ్డగోలుగా దోచుకోవటానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులకు, జనం ఓట్లు రొల్లుకునేందుకు ప్రకటించిన పథకాలకు లక్షల కోట్లు తగలేసిన నేటి విపక్ష నేతలు, గతమంతా పదినెలల్లోనే మరిచిపోయి నేటి ప్రభుత్వాన్ని ఎలా దబాయిస్తున్నారో అర్థం కావటం లేదు. వీళ్లు నిజంగానే లాజిక్ మిస్సయ్యారా లేదా ప్రజలు ఇవన్నీ పట్టించుకోరనే భ్రమలో ఉన్నారా? లేదా జనం జ్ఞాపకశక్తి కోల్పోయారని నమ్ముతున్నారో అర్థం కాలేదు. 

పథకాల అమలు 

అధికార పార్టీ నేతలేమో, తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉన్నామని చెబుతున్నారు.  ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి తెచ్చామని, దీంతో కోట్లాది మంది మహిళలు పావలా ఖర్చు లేకుండా ఈ సౌకర్యాన్ని వాడుకున్నారని,  నెలకి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, రూ. 500కే గ్యాసు బండను అందిస్తున్నామని చెబుతున్నారు. ఏ గూడూ లేక అద్దె ఇళ్లలో ఉన్నవాళ్లు.. రేపో మాపో ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు రంగం సిద్ధం చేశామని, కాస్త వెనకాముందైనా బీదలకు నీడ ఏర్పరుస్తామని వివరిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, రూ. 2 లక్షల లోపు రుణమాఫీ జరగగా, సాంకేతిక కారణాలు, రూ. 2 లక్షలకు పైబడిన రైతులు ఆపై మొత్తం కట్టకపోవటంతో కొంతమంది మాఫీ ప్రక్రియ ఆలస్యమైందని అంగీకరించి, రుణమాఫీ అనేది నిరంతర ప్రక్రియ కనుక చిట్టచివరి రైతు కూడా బెంగపడొద్దని భరోసా ఇస్తున్నారు. లెక్కలతో సహా మాఫీని ఏకరవుపెడుతూనే ఉన్నారు. పావలా డబ్బులు కూడా రైతు నుంచి తీసుకోకుండా ఉచితంగా పంటల బీమా ఇస్తామని వివరిస్తున్నారు. ఒక విడత రైతుభరోసా పైసలూ పడ్డాయి.

ప్రజాస్వామ్య అనుభూతి

గద్దెనెక్కింది మొదలు నేటివరకు గంట తీరిక లేకుండా ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా జనంలో తిరుగుతూ, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉండటం, గతంలో ఎన్నడూ లేనట్లుగా జనం వాళ్ల గోస చెప్పుకునేందుకు నమ్మకంగా ముఖ్యమంత్రి నివాసానికి, ప్రజా భవన్‌‌కూ పోయే  వెసులుబాటూ ఉండటంతో ప్రజాస్వామ్య వాతావరణం జనానికి స్వయంగా అనుభూతిలోకి వచ్చింది. 

ఉద్యోగాల భర్తీ 

పది నెలలలో 11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలతో బాటు మరో 45 వేల సర్కారీ కొలువుల భర్తీతో బాటు జాబ్ క్యాలెండర్ వేసి కొలువుల భర్తీకి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఇంత చేస్తుంటే పట్టుమని 10 నెలలు కాకుండా ఏదో జరిగిపోయిందంటూ నిన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ నేతల ద్వయం రోజూ అదే పనిగా గోల గోల చేయటమేంటో అర్థం కావటం లేదు. విపక్ష నేతల మాటల వల్ల జనం ఎంత ప్రభావితం అయ్యారో గానీ, ఆనాటి నెరవేరని హామీల ముచ్చట్లు అనేకం.. వద్దన్నాయాదికొస్తున్నాయి.

ఏనాడూ ప్రజలు పట్టలేదు

మిగులు రాష్ట్రమని, ధనిక రాష్ట్రమని మీరు చెప్పిన తెలంగాణలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వలేకపోయిన మాట నిజం కాదా? ‘మేమొస్తే, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే మాటే ఉండదు. అన్నీ సర్కారీ కొలువులే’ అని నమ్మబలికి పదేళ్లలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయలేకపోగా, కనీసం పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఆపలేకపోయారెందుకు?.. అంతెందుకు? పదేళ్ల పాలనలో ఒక్కనాడైనా ముఖ్యమంత్రి నేరుగా జనాన్ని కలిసి వారి గోస విన్నారా? కనీసం మంత్రులకైనా నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇలా చెప్పుకుంటే ఆ పాత మధురాలు ఎన్నెన్నో.  

పాలకుడి ప్రవర్తననూ ప్రజలు గమనిస్తారు

మా డిన్నర్ టేబుల్ చర్చలో చివరికి.. నేటి విపక్ష నేతలు మాట్లాడుతూ.. ‘కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆలోచన లేకుండా ప్రకటించిన దళిత బంధు దెబ్బకొట్టింది. డబుల్ బెడ్‌‌రూమ్‌‌లూ మాకు ఈసారి నష్టం చేసినా, 2018లో మా గెలుపుకు అవీ ఓ కారణమే. అయితే, ఆ వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, కట్టినవాటినీ లబ్దిదారులకు ఇవ్వలేకపోయాం. అలాగే వందల ఎకరాలున్నోడికీ, గుంట భూమి ఉన్నోడికీ భూమిని బట్టి సాయం ఇచ్చి చిన్నరైతులు, కౌలు రైతుల నుంచి వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాం. ధరణి కూడా మా కొంప ముంచింది. మా దరిద్రానికి సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ పిల్లర్లు కుంగి బద్నాం అయ్యాం. అయితే,  రైతు బంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో అమలుచేసినా, మా సారు సచివాలయానికే రాకపాయె? అలా వచ్చి ఉంటే జనంలో ఇంత వ్యతిరేకత పెరిగేది కాదు. జనం పాలకుల యాటిట్యూడ్ కూడా చూస్తారనే మాట ఇక్కడే కాదు ఏపీలో జగన్ విషయంలోనూ నిజమైంది’ అని అయిష్టంగానే అంగీకరించటంతో మా డిన్నర్ చర్చ ప్రశాంతంగా ముగిసింది. 

అవినీతి కంపు

ఆనాడు సర్పంచుల బిల్లులు ఆపితే, ఆస్తులమ్మి, అప్పులు తెచ్చిన సర్పంచులకు చనిపోతే‘అయ్యో.. పాపం’ అని కూడా సానుభూతి చూపలేదే? ఫీజు రియంబర్స్‌‌మెంటు బకాయిల వల్ల పిల్లల సర్టిఫికెట్లు రాక, చదువు పూర్తయ్యాక కూడా వారు కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉంటే పట్టించుకోనిది ఎవరు? మిమ్మల్ని నమ్మి, మీరు అప్పగించిన పనులు చేశాక.. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపింది ఎవరు? చేపల పెంపకం, గొర్రెల పంపిణీ, ధరణి, కాళేశ్వరం నిర్మాణం, కరెంటు కొనుగోళ్లు, సింగరేణి అవకతవకలు.. ఇలా ప్రతి పనిలో అవినీతి కంపుతో జనం ముక్కు పుటాలు పగిలిపోయినా, 
విననట్లు దులుపుకుని పోలేదా?

‘మేం పాలించటానికే పుట్టాం’ అనే ధోరణి

మరి ఇన్ని వైఫల్యాలు నెత్తిన పెట్టుకొని, ఏదో అయిపోతోందంటూ సోషల్ మీడియాలో  అలుపెరగకుండా విపక్షంలోని ఆ ఇద్దరి నేతల ప్రచారం వల్ల మరోసారి ప్రజలకు పాత ముచ్చట్లన్నీ గుర్తొస్తున్నాయి. ఒకవైపు ఉన్నవీ లేనివీ పోగేసి, సొంత మీడియాలో విష ప్రచారం చేస్తూనే, మరోవైపు తమకు వ్యతిరేకంగా వార్తలు కవర్ చేసే మీడియా సంస్థల మీద గుండెలు బాదుకుంటూ మాట్లాడటం వింతల్లోకెల్లా వింత. ‘మేమింతే. మేం అందరినీ ప్రశ్నిస్తాం. మమ్మల్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు. ఆ అర్హతే ఎవరికీ లేదు. మేం పాలించటానికే పుట్టాం’ అన్న ధోరణి ఈ విపక్ష పార్టీ నేతల మాటల్లో, వారి శరీర భాషలో వద్దన్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉండటంతో జనం వారి వ్యవహారశైలిని మరింత బాగా అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీల మీద ఒంటికాలి మీద లేస్తున్న యువనేతలిద్దరూ మరిచిపోయారేమో గానీ, నాడు మీరు బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌‌ను ఎంత అప్రజాస్వామికంగా తప్పించారో జనానికి తెలియదా? అధికారంలో ఉంటే ఫక్తు రాజకీయ పార్టీగా, పవర్ పోగానే ఉద్యమ పార్టీ అంటూ మీరు కొట్టే పోజులు జనం గుర్తించలేరనే భ్రమల్లో ఉన్నారా? 

- పీవీ శ్రీనివాస్, 
ఎడిటర్ ఇన్ చీఫ్, బిగ్ టీవీ