ఆ తెలంగాణ తల్లిని గాంధీభవన్​కు పంపిస్తం.. రాజీవ్ గాంధీ విగ్రహాన్నీ తీసేస్తం: కేటీఆర్

  • మన తెలంగాణ తల్లి బీదగా ఉండాల్నా? అని ప్రశ్న
  • కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫొటోలను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపు
  • దుండిగల్​లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

దుండిగల్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘‘మేం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా రాహుల్​గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం. భస్మాసుర హస్తం చూపిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవంగా గాంధీ భవన్ కు పంపించి, నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిలబెడతాం. చూడగానే చేతులెత్తి మొక్కే విధంగా గతంలో తెలంగాణ తల్లిని రూపొందించుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి అవమానించిన వారికి తగిన బుద్ధి చెప్తాం” అని అన్నారు. 

ప్రభుత్వ తీరుకు నిరసనగా కిరీటం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోషల్ మీడియాలో డీపీలుగా పెట్టుకోవాలని, మంగళవారం ఆ విగ్రహానికి పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్ జిల్లా దుండిగల్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 

తల్లిని మార్చిన వ్యక్తులు ఉన్నారా? 

ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా గాంధీజీ వారణాసిలో భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక దేవతామూర్తిగా బంగారు కిరీటం, ఆభరణాలు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక అదే విగ్రహాన్ని కొనసాగించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుతల్లికి, పక్కనే ఉన్న తమిళ తల్లికి, కన్నడ తల్లికి సైతం కిరీటం ఉంది. మరి మన తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే తప్పేంటి? తెలంగాణ తల్లి బీదగా ఉండాల్నా?” అని ప్రశ్నించారు. 

‘‘ఉద్యమ సమయంలో ఎంతో మేధోమథనం చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. కేసీఆర్​ నాయకత్వంలో కవులు, కళాకారులు, మేధావులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఆడబిడ్డల చిహ్నంగా బతుకమ్మను, గద్వాల పోచంపల్లి నేతన్న చీరను, కరీంనగర్ వెండి మెట్టెలను, మెట్ట పంటలతో చూడగానే దండం పెట్టే విధంగా ఉండే తెలంగాణ తల్లిని తయారు చేశారు. కానీ ఆ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ప్రపంచంలో ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండవచ్చు. కానీ, తల్లిని మార్చిన వ్యక్తులు ఉన్నారా? తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగింది. రేవంత్ రెడ్డి పెట్టింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదు.. కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని” అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు తెలంగాణ చరిత్ర తెలియదని ఫైర్ అయ్యారు. 

రేవంత్ ద్రోహిగా మిగిలిపోతడు.. 

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని కేటీఆర్​ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గద్దె దిగడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటామని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు మొదలు ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ బలోపేతం కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

‘‘అదానీ కోసం, అల్లుడి కోసం, అన్నదమ్ముల కోసం, బావమరిదికి అమృతం పంచడం కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి జోర్దార్ గా పని చేస్తున్నరు. ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదు. కేసీఆర్ పై తిట్లు, దేవుడి మీద ఒట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ కాలం వెళ్లదీస్తున్నడు” అని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారంటీలు అటకెక్కినయని విమర్శించారు.