అడిగి మరీ ఎంక్వైరీలు.. బీఆర్ఎస్​ నుంచే సవాళ్లు.. ఫార్ములా–ఈ రేస్​పైనా అదే తీరు

  • దర్యాప్తు చేయాలంటూ బీఆర్ఎస్​ నేతల నుంచే సవాళ్లు
  • గతంలో కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ లీడర్ల డిమాండ్​
  • వెంటనే రెండు జ్యుడీషియల్ కమిషన్ల ఏర్పాటు
  • ప్రభుత్వం చేతికి విద్యుత్ కమిషన్ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేస్, ఓఆర్ఆర్ టెండర్లు.. ఒక్కటేమిటి గత ప్రభుత్వంలో జరిగిన పలు అక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ అడిగి మరీ ఎంక్వైరీలు చేయించుకుంటున్నది. దమ్ముంటే దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్న పార్టీ లీడర్లు.. ఆ తర్వాత మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నుంచి.. తాజా ఓఆర్ఆర్ టెండర్ల దాకా ఇదే విషయం స్పష్టంగా తెలుస్తున్నది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లపై దమ్ముంటే విచారణ చేయించాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. దీంతో ప్రభుత్వం రెండు వేర్వేరు జ్యుడీషియల్ కమిషన్లను నియమించింది.  విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తయి రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందింది. కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నది.

దర్యాప్తు ఎదుర్కోలేక..
జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ జ్యుడీషియల్​కమిషన్​ను ఏర్పాటు చేయగా.. వేగంగా విచారణ చేపట్టింది. అందులో భాగమైన వారందరినీ విచారించింది. అప్పటి సీఎం కేసీఆర్​కూ నోటీసులు పంపింది. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డినీ విచారణకు పిలిపించింది. అయితే, కేసీఆర్ మాత్రం విచారణకు రాలేదు. పైగా తప్పించుకునేందుకు కమిషన్​పైనే రివర్స్​లో ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. సుప్రీంకోర్టుకూ వెళ్లారు. విచారణ చేయాలని సవాల్ విసిరినా.. తీరా విచారణ సమయంలో మాత్రం హాజరుకాకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తప్పించుకున్నారు.

ఇటు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా దాదాపు చివరి అంకానికి చేరుకున్నది. ఇంజనీరింగ్, ఒక్కరు తప్ప ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తయిపోయింది. ఇక, మిగిలింది కాంట్రాక్ట్ సంస్థలు, ప్రజాప్రతినిధుల విచారణే తరువాయి. ఆ విచారణకు కమిషన్ పిలిస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే హరీశ్ రావు పలువురు అధికారులతో మాట్లాడారని పొలిటికల్ సర్కిల్స్​లో వినిపిస్తున్నది. అలాగే కమిషన్ పిలిస్తే కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.

ఫార్ములా–ఈ రేస్​పైనా అదే తీరు
ఫార్ములా–ఈ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. నిర్వహణ సంస్థకు రూ.55 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చారని చెబుతున్నది. దీనిపై దమ్ముంటే విచారణ చేసుకోవచ్చని, ఏం చేస్కుంటరో చేస్కోండంటూ కేటీఆర్ మీడియా సాక్షిగా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే గత గురువారం ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్​ను చేర్చింది. కేసు పెట్టకముందు జైలుకెళ్లి యోగా చేసుకుంటానని, స్లిమ్​గా తయారై బయటకు వస్తానని గంభీరంగా చెప్పిన కేటీఆర్.. కేసులో ఏ1గా చేర్చగానే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. కేసుపై సవాల్ విసిరి ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోతున్నారు.

ఓఆర్ఆర్ టెండర్లపై అసెంబ్లీలోనే సవాల్​
ఓఆర్ఆర్ టెండర్లపై ఇదే తరహాలో బీఆర్ఎస్ బుక్కైపోయింది. అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై చర్చ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై చర్చకు రాగా.. ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వానికి దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేయాలని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ద్వారా విచారణ చేయిస్తామని చెప్పారు. వెంటనే హరీశ్ రావు వెనకడుగేసి తాము టెండర్లను రద్దు చేయమన్నామేగానీ.. విచారణ అడగలేదని బుకాయించారు. దానికీ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే బదులిచ్చారు.

టెండర్లు రద్దు చేయాలంటే.. విచారణ చేయాలి కదా.. బీఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నదీ అదే కదా అని చురకలూ అంటించారు. ఇలా ప్రతి కేసులోనూ అడిగి మరీ విచారణలు చేయించుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లు.. ఆ తర్వాత పునరాలోచనలో పడుతున్నారు. అన్ని వేళ్లూ వాళ్లవైపే చూపిస్తుండడంతో వెనుకడుగు వేస్తున్నారు.