అవే అడుగుజాడలా?

పాటలు మారినా,  పదాలు  మారినా  రాగం మాత్రం మారడం లేదు.  ప్రభుత్వాలు మారినా,  పదవులు మారుతున్నా అవే మొహాలు.  ప్రభుత్వాల్లో  మార్పొచ్చినా  అవే  ఆలోచనలని  తెలంగాణలో  నడుస్తున్న  చరిత్ర  చెబుతున్నది.  ప్రభుత్వాలు మారితే  విధానాల్లో  మార్పుండాలి.  పాలనలో  తమ మార్కూ  కనపడాలి.  నిర్ణయాల్లో  సరికొత్త  ఆలోచనలు ఆవిష్కరించాలి.  

తెలంగాణలో  కాంగ్రెస్సర్కారు కొలువుదీరి ఏడాది గడిచిన సందర్భంగా  లోతైన విశ్లేషణ అనివార్యం.  కేసీఆర్  పంథాను ప్రజలు తిరస్కరించారు. ఆ పంథా కాంగ్రెస్​ ప్రభుత్వంలోనూ,  అంతకాకున్నా కొంత కనిపించడం  రేవంత్​మార్క్​కు మంచి పరిణామం కాదని మాత్రం చెప్పొచ్చు.  తెలంగాణలో  మార్పుకోసం సకలయత్నాలు సఫలీకృతమవుతోన్నా..  అత్యంత  సంశయంతో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ చర్చనీయాంశమవుతున్నాయి.  తెలంగాణ అస్తిత్వం,  ఉద్యమకారుల  గుర్తింపుపై  మాత్రం  సమగ్ర  చర్చ జరగవలసి ఉన్నది.

టీఎస్ నుంచి టీజీ,  తెలంగాణ గేయం జాతికి అంకితం,  తెలంగాణతల్లి  ఆవిష్కరణల వంటి వాటితో   తెలంగాణ  సమాజం ఈ ప్రభుత్వ చర్యలను స్వాగతించింది కూడా.  అయితే,  ఉద్యమకారుల పట్ల కొత్త  చిత్తశుద్ధిని ప్రదర్శించే  ప్రయత్నాల్లో తప్పటడుగులు  పడుతున్నాయన్న  విమర్శ వినబడుతున్నది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్​గా,  సీఎంగా  మొదటి నుంచీ తెలంగాణ  ఉద్యమకారులకు  అన్యాయం జరిగిందని పదే పదే చెబుతున్నా..  పాత  సంప్రదాయాన్నే కొనసాగించడం విమర్శలకు తావిస్తున్నది. నిజానికి గత వారం రోజుల నుంచి  సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో భిన్నమైన ఎత్తుగడనే అనుసరించారు.  

గత  సమావేశాల శైలికంటే  తాజాగా  సచివాలయ ప్రాంగణంలో  జరిగిన సమావేశశైలిలో  భిన్నకోణం ఆవిష్కృతమైంది.  తిట్లు,  శాపనార్థాలు  లేకుండా ఉద్యమ నేపథ్యాన్ని  స్మరించుకుంటూ  ఆయన  ప్రసంగం  సాగినందుకు  సీఎం చాలా పరిణతి చెందిన నేతగా కనిపించారు.

కేసీఆర్​ మార్గంలోనే పయనమా?

తెలంగాణ  రాష్ట్రమొచ్చిన  పదేండ్లూ  తెలంగాణ గేయం లేదు.  తెలంగాణ తల్లికి అధికారిక ఆమోదమూ లేదు. ఈ రెండింటిని సాధించిన  సీఎం రేవంత్ తెలంగాణవాదుల్లో స్థానం సంపాదించుకున్నా..  తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంలో  కొంత విమర్శ ఎదుర్కోవాల్సి వస్తోంది.  ధిక్కార  స్వరాల నోళ్లు  మూయించే  ప్రయత్నమా?   లేక  రాజకీయ  వ్యూహాత్మక  ఎత్తుగడనా ఏమోగాని  తెలంగాణ కవులు.

Also Read : పత్తిరైతుకు మద్దతు లభించేదెప్పుడు?

కళాకారులు, జర్నలిస్టులు,  ఉద్యమకారులు పేర్లతో ఆయన ఆయా రంగాలలో  వాళ్లను స్మరిస్తూ  తొమ్మండుగురి కుటుంబాలను  ఆదుకునే  ప్రయత్నం  కొంత చేశారు.  అయితే,  ఆ తొమ్మిది మంది  కుటుంబాలను ఆదుకోవడం, సత్కరించే  ప్రయత్నం స్వాగతించదగ్గదే.  కాకపోతే  తెలంగాణ ఉద్యమకారులుగానే కాకుండా, గత పదేండ్ల పాలనలో తెలంగాణను వాడుకోవడం తప్ప ఏమీ ఒరగబెట్టని కేసీఆర్​పై యుద్ధం చేసినవారు కొందరు ఉన్నారు తప్ప  అందరు లేరనేదే ప్రజల్లో ఉన్న చర్చ.

ఉద్యమకారుల గుర్తింపునకేది కొలమానం

సామాన్యులకు  రాజనీతి,  సిద్ధాంత  విలువలు,  నైతికత  అంతలోతుగా  అర్థం కాకపోవచ్చు.  కానీ,  నిజమైన ఉద్యమకారులకైతే  కొంత అవమానం,  అనుమానం కలగకమానదు.  నాడు  కేసీఆర్  సర్కారులో  విమర్శకులు ఉండకూడదు.  జీ హుజూర్  అనే వాళ్లకే   పదవులను ఎరవేసి,  దొడ్లో  కట్టేసుకుంటే సరి అనే భావన ఉండేది.  అలాంటివాళ్లకే   కేసీఆర్  పదవులిచ్చి సత్కరించుకున్నారు. తన సొంత మీడియా సంస్థల నుంచి  ధిక్కార  స్వరాలను ఉల్టా  ఒకటికి  పదింతలిచ్చి  బయటకు పంపిన సందర్భాలున్నాయి.

నిజానికి  తెలంగాణ అక్షరాలే  శ్వాసగా,   రచనలే ప్రాణంగా,  ఉద్యమాలే ఊపిరిగా  బతికినవాళ్లు, ఉద్యమంలో  స్వచ్ఛందంగా  ఎవరికివారుగా  పాల్గొన్నవాళ్లు  ఎందరికో  గుర్తింపురాలేదు.  దీంతో  ఉద్యమకారుల గుర్తింపునకేది  కొలమానం అన్న మనో వేదనతో  చాలామంది తనువులు చాలించుకున్నారు.  తెలంగాణలో  కేసీఆర్  సర్కారు వచ్చిన తొలి మూడు,  నాలుగేండ్లలో   రాష్ట్ర,  జిల్లా స్థాయిల్లో  కవులు, కళాకారులకు,  జర్నలిస్టులకు,  ఉద్యమకారులకు కొంత గుర్తింపు లభించింది.  

కాకపోతే,  ఎప్పుడైతే ఉద్యమ పార్టీ  రాజకీయపార్టీగా అవతరించిందో, తెలంగాణ పదాన్ని,  వాదాన్ని  విస్మరించారో,  అప్పుడే  పార్టీలో,  ప్రభుత్వంలో  ఉద్యమకారులకు  విలువలేకుండాపోయింది.  ఫలితంగా ఆ పార్టీకి ఉద్యమకారులు క్రమేణా దూరమైపోయారు.


ఉద్యమంలో జర్నలిస్టుల కీలకపాత్రతొలి, మలి తెలంగాణ ఉద్యమంలో  అరుణోదయ సాంస్కృతిక సంస్థ నుంచి తమ జీవితాలను ధారపోసినవాళ్లను రెండు  ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయి.  ఉద్యమంలో  ఉగ్గుపాలు పోసిన ఉస్మానియా, కదం తొక్కిన కాకతీయ వర్సిటీల నుంచి ఇప్పటికీ కొందరు నిరాదరణకు గురవుతున్నారు.  

తెలంగాణ కోసమే  తెలంగాణ  జర్నలిస్టులనే  ట్యాగ్ లైన్ పుట్టించిన ఓరుగల్లు జర్నలిస్టులు ఉద్యమంలో  కీలక పాత్ర పోషించారు.  వరంగల్  ప్రెస్ క్లబ్  వేదికగా నాడే  రాజకీయ పార్టీలతో సమన్వయం జరిగింది.  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో  వేయి కలాలు..లక్ష పిడికిళ్లు  పేరిట అక్కడి జర్నలిస్టుల పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు.  

తెలంగాణ రాష్ట్రం అనంతరం కొందరు  రాజకీయంగా  పదవులు పొందారే తప్ప, నిజమైన ఉద్యమకారులను  విస్మరించారన్నది కాదనలేని నిజం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా కొంత ఉద్యమకారులను గుర్తింపునిచ్చి గద్దర్ కూతురు వెన్నెలకు  పోటీ చేసే అవకాశం కల్పించింది.  ఓడినా సాంస్కృతిక సారథి నామినేటెడ్  పదవితో సత్కరించింది.  ఉద్యమకారులైన మందుల సామేల్,  వేముల వీరేశం, యెన్నం శ్రీనివాస్ రెడ్డి,  ఓయూ  జేఏసీ నుంచి మేడిపల్లి సత్యంలాంటి వాళ్లను  చట్టసభలకు పంపింది. 

ఉద్యమకారులు.. సమరయోధులుగా గుర్తింపు హుళక్కేనా

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఇళ్లు, వాకిళ్లు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్లు, లాఠీ దెబ్బలకు వెరవని వాళ్లు,  కేసుల్లో ఇరుక్కుని రేయింబవళ్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి ఆత్మ బలిదానాలు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఉద్యమ సమయంలో  వీరులు, శూరులు, త్యాగధనులు అంటూ పొగిడినవారే.. ఆ తర్వాత దూరం పెట్టారు. సాయం కోసం వెళితే.. నేతల చీత్కరింపులు అవమానాలు, నిరాదరణ ఎదుర్కొంటున్నారు!  

పదేండ్లు  గడిచిపోయినా వారివైపు ఏ ప్రభుత్వాలు కన్నెత్తి చూడలేదు. తమకు కనీసం డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నవారున్నారు.  నిజానికి తమది ఇక ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రకటించినప్పుడే ఉద్యమకారుల త్యాగాలన్నీ  కాలగర్భంలో కలిసిపోయాయి.  

Also Read : కులగణనే పరిష్కారం

రేవంత్​ సర్కారు ఇప్పటికైనా  రాష్ట్ర,  జిల్లా స్థాయిలో కమిటీలు వేసి  నిజమైన ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది.  సర్కారు తమను  స్వాతంత్ర్య  సమరయోధుడి తరహాలో  గుర్తిస్తే చాలనే ఆశతో  ఉద్యమకారులు ఆశావాదంతో ఉన్నారు.

కేసీఆర్, తెలంగాణకు తెగిపోయిన పేగుబంధం

కేసీఆర్  జారవిడుచుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని,   పీసీసీ చీఫ్  హోదాలో  రేవంత్ పట్టుకునే ప్రయత్నం చేశారు.  టీఆర్ఎస్​  బీఆర్ఎస్​గా   మారిన సందర్భంలో  ఇక  కేసీఆర్​కు  తెలంగాణకు పేగుబంధం  తెగిపోయిందని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆయన  ఉద్యమకారుల్లో  స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేశారు.  ఇందులో  భాగంగా  ఎన్నికల  ప్రచారంలో,  మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారుల  ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమ సమాజానికి మరింత దగ్గరయ్యారు.  

తెలంగాణ పట్ల,  ఉద్యమకారుల పట్ల  సీఎం రేవంత్​కు  అమితమైన  ప్రేమ ఉందని,   కేసీఆర్​ దగ్గర గుర్తింపునకు  నోచుకోనివాళ్లు,  నిరాదరణకు,  అవమానాలకు గురైనవాళ్లను చేరదీస్తారనే నమ్మకం ఉండేది. కానీ,  తాజాగా  సచివాలయ ప్రాంగణంలో  జరిగిన తెలంగాణ తల్లి ఆవిష్కరణ వేడుకల్లో  ప్రస్తావించిన పేర్లలో  కొందరి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా.. అందరి పట్ల అంతే హర్షం వ్యక్తం చేయలేకపోతున్నారు.  

గత  ప్రభుత్వంలో వివిధ  పదవులు  కట్టబెట్టినవారికే,  ఈ సర్కారు కూడా నామినేటెడ్  పదవులిస్తున్నది, సన్మానాలు చేస్తోంది.  గతంలో  సత్కారం పొందినవాళ్లలో  కొందరు ఇప్పుడూ  రూ.కోటి నగదుతో  సత్కార వరుసలో  ముందుండటంతో..  ‘ఇప్పుడూ  వాళ్లేనా’అనే చర్చ ప్రజల్లో లేకపోలేదు.

-  వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ, జర్నలిస్టుల ఫోరం-