ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొట్లాట..ఎనిమిది మందికి తీవ్ర గాయాలు 

  •     రాళ్లు, కట్టెలు, కారంతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు 
  •     వికారాబాద్​ జిల్లా గుండాల్ తండాలో ఘటన

పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్​తండాలో ఇందిరమ్మ ఇండ్ల విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు, కట్టెలు, కారంపొడితో దాడి చేసుకోవడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గుండాల్​తండాలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే నిర్వహించారు. ఓ ఇంటి దగ్గర సర్వే చేస్తుండగా, అక్కడికి వచ్చిన కొంతమంది బీఆర్ఎస్​కార్యకర్తలు ‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ వాళ్లకేనా? అర్హులకు ఇవ్వరా?’ అని పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యను అని ప్రశ్నించారు.

దీంతో ఆయన అర్హులకే పథకం వర్తిస్తుందని, అనర్హులకు ఇండ్లు ఇవ్వబోమని వారికి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్​కార్యకర్తలు, లీడర్లు.. బీఆర్ఎస్​కార్యకర్తలను అడ్డుకున్నారు. అధికారులు సర్వే చేస్తుంటే అడ్డు పడడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆదివారం రోజే దోమ పీఎస్​లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నౌర్య నాయక్ వర్గంపై బీఆర్ఎస్​కు చెందిన దేశ్యానాయక్ ఫిర్యాదు చేశారు. పోలీస్​స్టేషన్​దాకా వెళ్లొద్దని, పంచాయితీ పెట్టి మాట్లాడుకుందామని గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పి తీసుకువచ్చారు.

సోమవారం ఉదయం గ్రామంలో గొడవపై పంచాయితీ నిర్వహించారు. అయితే, దీనికి కాంగ్రెస్ కు చెందిన నౌర్య నాయక్ తో పాటు ఆయన వర్గీయులు రాలేదు. దీంతో బీఆర్ఎస్ కు చెందిన దేశ్యా నాయక్ కుటుంబ సభ్యుల్లోని కొందరు మహిళలు నౌర్యనాయక్​తో పాటు అతడి వర్గీయుల ఇండ్లకు వెళ్లి పంచాయితీకి రావాలని కోరారు. ఈ క్రమంలో నౌర్యనాయక్, దేశ్యానాయక్​కుటుంబాల్లోని మహిళలు మాటా మాటా అనుకున్నారు. దీంతో గొడవ పెద్దదైంది. బీఆర్ఎస్ లీడర్లు కూడా అక్కడికి చేరుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కట్టెలు, కారంపొడితో దాడులు చేసుకున్నారు.

ఈ గొడవలో దేవమ్మ, రెడ్యానాయక్, రాంసింగ్, రాజు, లాల్యా నాయక్, రవి, సురేశ్ తలలు పగిలాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దవాఖానలో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.