మహిళలు ఫ్రీగా బస్సు ఎక్కితే బీఆర్ఎస్ ​ఓరుస్తలే.. మంత్రి సీతక్క విమర్శ

షాద్ నగర్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క చెప్పారు. శనివారం షాద్ నగర్ నియోజకవర్గంలోని మధులాపూర్, అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, చెగూర్​గ్రామాలలో ఆమె పర్యటించారు. మధులాపూర్ నుంచి కమ్మదనం గ్రామం వరకు రూ.7 కోట్లతో బీటీ రోడ్డు, రూ.15 లక్షలతో కమ్యూనిటీ బిల్డింగ్, రూ.35 లక్షలతో మహిళా సమాఖ్య బిల్డింగ్, అప్పారెడ్డిగూడలో నూతన పంచాయతీ భవనం, చెగూర్ లో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 

మహిళా సంఘాలకు రూ.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మహిళలకు ఏమీ చేయలేదని, కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక పేదింటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. షాద్​నగర్​అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​కృషి చేస్తున్నారని చెప్పారు. 

ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ప్రియాంక, మార్కెట్ చైర్మన్ సులోచన తదితరులు పాల్గొన్నారు.