స్పీకర్​పైకి పేపర్లు విసిరి..వెల్​లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్​ రచ్చ

  • అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన
  • వెల్​లోకి దూసుకెళ్లిన హరీశ్, కౌశిక్, వివేకానంద, అనిల్ జాదవ్ 
  • స్పీకర్​ పోడియంను టచ్​ చేసి, పెద్దఎత్తున నినాదాలు 
  • ఫార్ములా–ఈ రేసు అంశంపై చర్చించాలని పట్టు
  • స్పీకర్​ను అవమానించినోళ్లను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ 
  • బీఆర్ఎస్ ఆందోళనల మధ్య సభ రెండు సార్లు వాయిదా 
  • నినాదాల మధ్యే భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు : ఫార్ములా–ఈ రేస్ అంశంపై చర్చించాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి చేశారు. వెల్​లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్​పైకి కాగితాలు చింపి విసిరేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచే ‘కాంగ్రెస్​ హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా?’ అని నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో అసెంబ్లీలోకి ఎంటర్​అయ్యారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువెళ్లారు. కీలకమైన భూభారతి బిల్లు అంశంపై చర్చ ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలు మార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరినా వెనక్కి తగ్గలేదు.

ఇదే టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్ములా–ఈ అంశంపై చర్చ అవసరం లేదని, గవర్నర్ అనుమతి ఇచ్చాకే దానిపై ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ అనుమతితో భూభారతి బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. తర్వాత బిల్లుపై మంత్రి స్పీచ్ ప్రారంభించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తమ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానందను ముందుకు తోసుకుంటూ దూసుకెళ్లి పోడియంను పట్టుకున్నారు.

వీరిని మార్షల్స్ అడ్డుకోగా, మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అదేటైంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కౌశిక్ రెడ్డి ప్లకార్డులను చింపి స్పీకర్ పైకి విసిరేశారు. తర్వాత స్పీకర్ పోడియం కింద  ఆఫీసర్ల టేబుల్ మీద ఉన్న పేపర్లను తీసుకున్న కేపీ వివేకానంద మళ్లీ స్పీకర్ మీదకు విసిరేశారు. సభను స్పీకర్ వాయిదా వేశారు.   

స్పీకర్​కు అవమానంపై కాంగ్రెస్ ఆగ్రహం..  

సభ తిరిగి స్టార్టయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ ఆందోళనలు ప్రారంభించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగానే సీఎం కూర్చునే సీటు నుంచి స్పీకర్ సీటు దగ్గరకు వెళ్లేందుకు జగదీశ్​రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. వీరిని మార్షల్స్ అడ్డుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూర్చునే వైపు తీసుకొచ్చారు. బిల్లు గురించి పొంగులేటి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి పేపర్లు చింపి స్పీకర్ వైపు విసిరేశారు. మంత్రిపైకి దూసుకువచ్చే అవకాశం ఉండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విప్​లు పొంగులేటి చుట్టూ రక్షణగా నిలిచారు.

Also Read :- కాళేశ్వరం డిజైన్లకు సీడబ్ల్యూసీ అనుమతుల్లేవ్

ఇదే టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన చేతిలోని పేపర్లను కౌశిక్ రెడ్డి మీదకు విసిరేశారు. భూ భారతి మీద చర్చ ముగిశాక తన చాంబర్ కు పిలుస్తానని స్పీకర్ హామీ ఇచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వీడలేదు. దీంతో మరోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. దళిత స్పీకర్ ను అవమానించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని విప్​లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.  

స్పీకర్ చాంబర్​లో మీటింగ్

సభకు బ్రేక్ ఇచ్చాక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన చాంబర్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇందులో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్​లో సైతం ఫార్ములా–ఈపై చర్చించాలని, దీనిపై సభలో ప్రకటన చేసేంత వరకూ నిరసన కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

దీనిపై ఫ్లోర్ లీడర్(సీఎం)తో మాట్లాడాక నిర్ణయం చెబుతానని స్పీకర్ చెప్పారని మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాబీల్లో మీడియాకు తెలిపారు. కాగా, బ్రేక్ సమయంలో లాబీల్లో ఉన్న ఎంఐఎం ఆఫీసుకు విప్​లు ఆది శ్రీనివాస్, రాంచంద్రు నాయక్ వెళ్లారు. అక్కడికి అప్పుడే ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్​ఒవైసీ రావడంతో ఆయనను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. సభలో తమకు సహకరించాలని ఒవైసీని సీఎం కోరినట్లు తెలిసింది.

పేపర్లు మాత్రమే విసిరేసిన : వీర్లపల్లి శంకర్

మంత్రి పొంగులేటి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేపర్లు చింపి స్పీకర్ పైకి విసేరేశారని, దీంతో తాను కౌశిక్ మీదకు పేపర్లు విసిరేశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. తమ మంత్రి మాట్లాడుతుంటే ముందుకు వచ్చి స్పీకర్​పై పేపర్లు వేస్తూ సభా మర్యాద మంటగలిపాడనే పేపర్లు విసిరానన్నారు. కానీ తాను వాటర్ బాటిల్, చెప్పు పట్టుకొని చూపించానని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అసెంబ్లీలో సీసీ టీవీ ఫుటేజీలు ఉంటాయని, అవి చూస్తే వాస్తవం ఏంటో తెలుస్తుందన్నారు.