నడిపోడిని చంపి బైక్​పై డెడ్​బాడీతో ఏపీకి

  • ఫొటోలు తీసిన అక్కడి జనాలు 
  • శవాన్ని వదిలి పోలీసులకు లొంగిపోయిన నిందితులు 
  • ఆస్తి తగాదాలతో మర్డర్​ చేసిన అన్నదమ్ములు  
  • గద్వాల జిల్లాలో పెద్ద ధన్వాడలో ఘటన  

శాంతినగర్, వెలుగు : పొలం తగాదాలతో అన్న , తమ్ముడు కలిసి సోదరుడిని హత్య చేసి బైక్​పై డెడ్​బాడీని ఏపీకి తీసుకువెళ్తుండగా అక్కడి జనాలు ఫొటోలు తీసి సోషల్​ మీడియాలో పెట్టారు. దీంతో భయపడ్డ వారు శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్​రెడ్డి, శేషిరెడ్డి అలియాస్​ అగ్గిపుల్ల, చిన్న నాగిరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య ఏడాది నుంచి ఆస్తి తగాదాలున్నాయి. ఆదివారం ఉదయం చిన్న నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్​పై మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై షర్ట్ కప్పి తీసుకువెళ్తున్నారు. 

ఏపీలోని సుంకేసుల–కొత్తకోట గ్రామాల మధ్యలో అనుమానం వచ్చిన కొందరు వీరి ఫొటోలు తీసి సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. ఇది గమనించిన అన్నాదమ్ములు ఆ రెండు గ్రామాల మధ్య డెడ్​బాడీ పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న కోడుమూరు సీఐ, సి.బెళగల్, గూడూరు ఎస్ఐలు అక్కడికి చేరుకొని శవాన్ని పోస్ట్​మార్టం కోసం పంపించారు. నిందితులు అక్కడి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. హత్య ఎక్కడ జరిగిందో తెలియరాలేదని, ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలి ఎస్ఐ జగదీశ్​ తెలిపారు.