76 ఏండ్ల తర్వాత కలుసుకున్న.. పాకిస్తాన్ అన్న..భారత్ చెల్లెలు

76 ఏండ్ల తర్వాత కలుసుకున్న.. పాకిస్తాన్ అన్న..భారత్ చెల్లెలు

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 76 ఏండ్లు..అన్నను చూడకుండా చెల్లె..చెల్లెను చూడకుండా అన్న ఉండిపోయారు.  భారత దేశం విడిపోయిన సమయంలో దూరమైన అన్నాచెల్లెల్లు  ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని..మళ్లీ కలుసుకున్నారు. తోడబుట్టిన అన్నను చూడగానే చెల్లె  ఒక్కసారిగా ఆనందభాష్పాలు కురిపించగా..అమ్మలాంటి చెల్లెను చూడగానే అన్న కళ్లు చెమర్చాయి. వివరాల్లోకి వెళ్తే..

76 ఏండ్ల తర్వాత అన్నా చెల్లె..

1947లో భారత్ పాకిస్తాన్ విడిపోయిన సమయంలో మహ్మద్ ఇస్మాయిల్, అతని చెల్లె సురీందర్ కౌర్ విడిపోయారు. ఇస్మాయిల్ పాకిస్తాన్ లోని లాహోర్ కు 200 కిలో మీటర్ల దూరంలోని పంజాబ్ ప్రావిన్స్ సాహివాల్ జిల్లాలో నివసిస్తున్నాడు. అతని చెల్లె సురీందర్ కౌర్ భారత్ లోని పంజాబ్ జలంధర్ లో నివసిస్తోంది. వీరిద్దరి వయసు 80 ఏండ్లు. అయితే భారత్ పాకిస్తాన్ విడిపోయిన సమయంలో  దూరమైన ఈ ఇద్దరు ..76 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎలా కలుసుకున్నారంటే..

మహ్మద్ ఇస్మాయిల్, అతని చెల్లె సురీందర్ కౌర్ కలవడానికి కారణం సోషల్ మీడియా. పాకిస్తాన్ లోని పంజాబీ యూట్యూబ్ ఛానల్ లో ఇస్మాయిల్ స్టోరీని ప్రసారం చేశారు. ఈ స్టోరీలో తన చెల్లె విడిపోయిందన్న విషయాన్ని ఇస్మాయిల్ తెలిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన సర్దార్ మిషన్ సింగ్ మహ్మద్ ఇస్మాయిల్ ను సంప్రదించాడు. భారత్ లో నివసిస్తున్న సురీందర్ కౌర్ కుటుంబం గురించి ఇస్మాయిల్ కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత సురీందర్ కౌర్ తో ఇస్మాయిల్ ఫోన్ లో మాట్లాడాడు. 76 ఏండ్ల తర్వాత మాట్లాడుకున్న అన్నా చెల్లెలు..కార్తార్ పూర్ కారిడార్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ లో కలవాలని నిర్ణయించుకున్నారు. 

కలిసిన అన్నా చెల్లె..

అక్టోబర్ 22వ తేదీన మహ్మద్ ఇస్మాయిల్ పాకిస్తాన్ నుంచి కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కు చేరుకోగా..అదే రోజు భారత్ జలంధర్ నుంచి సురీందర్ కౌర్ కూడా కర్తార్ పూర్ లోని గురుద్వారాకు చేరుకుంది. అన్నను చూసిన చెల్లె..చెల్లెను చూసిన అన్న..ఇద్దరు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చెల్లె సిక్కు..అన్న ముస్లిం..ఎలా

అయితే ఇక్కడ గమనించాల్సింది సురీందర్ కౌర్ సిక్కు కాగా..మహ్మద్ ఇస్మాయిల్ ముస్లి్ం. ఇస్మాయిల్ పాకిస్తాన్ కు వెళ్లిపోయిన తర్వాత సిక్కు మతాన్ని వదులుకుని ముస్లింగా మారారు. కానీ భారత్ లో నివసిస్తున్న సురీందర్ కౌర్ , ఆమె కుటుంబం ఇప్పటికీ సిక్కులుగానే జీవిస్తున్నారు.