దళారుల ఇష్టారాజ్యం .. రైతుల పంటలు తక్కువ ధరకు కొనుగోలు

  • కాపు కాయలేక, వానలకు భయపడి అమ్ముంటున్న  రైతులు 
  • సెంటర్లలో  అన్నదాతలకు అడ్డంకిగా సర్కార్ నిబంధనలు 
  • ఎక్కడ చూసినా కల్లాల్లోనే ప్రైవేటు వ్యాపారుల కాంటాలు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  రైతుల పంటలను అడ్డికి పావు శేరు లెక్కనే కొంటున్నారు. ఏడాదంతా కష్టపడి పం టలు పండించిన అన్నదాతలను దోచుకొని నిండా ముంచుతున్నారు. వడ్లు, పత్తి, మిర్చి, పల్లి.. ఇలా పంట ఏదైనా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయి. 

మిల్లుల అలాట్ మెంట్ కాకపోవడంతో చాలా జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కాంటాలు కావడం లేదు. కొన్ని జిల్లాల్లో ఇంతవరకు సరిగా కొనుగోలు చేయడంలేదు. దీంతో కల్లాల వద్దే  ప్రైవేట్ వ్యాపారులకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు తక్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటున్నారు. 

రూ.1900కే సన్న వడ్లను కొంటున్నారు. పత్తి క్వింటా రూ.6,900 రేటు దాటడం లేదు. మిర్చి రూ.18 వేలు జెండా పాటగా పాడుతున్నా చివరకు రూ.16 వేలు నుంచి రూ. 14 వేలలోపే కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతూ..సన్న వడ్లు ఏ గ్రేడ్ రూ.2,320, దొడ్డు వడ్లకు రూ.2300గా మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలకు 230 ప్రారంభించారు. ఈ సీజన్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. 64 మిల్లులకు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో నలుగురు మిల్లర్లను డిఫాల్టర్ల లిస్ట్ లో చేర్చారు.

 ఇప్పటివరకు 12 మంది అండర్ టేకింగ్ ఇవ్వడంతో ధాన్యం కేటాయింపులు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. దీంతో నిన్న మొన్నటి వరకు రూ.2100 చొప్పున కల్లాల వద్దే పచ్చి ధాన్యం కొన్న ప్రైవేట్ వ్యాపారులు, తాజాగా రూ.1900 రేటు తగ్గించారు. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలుకాకపోవడం, అకాల వర్షాల భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

తేమ శాతం ఎక్కువ ఉందంటూ రిజెక్ట్ 

పత్తికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. మంగళవారం ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ పత్తి మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం సాకుగా చూపి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసిన వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇతర సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతుల పత్తిని ఆఫీసర్లు రిజెక్టు చేస్తున్నారు.  

ప్రైవేట్ వ్యాపారులు అదే పత్తిని రూ.6300కు రైతుల నుంచి కొనుగోలు చేసి తిరిగి రూ.7300 మద్దతు ధరకు సీసీఐకి అమ్ముతున్నారు. వచ్చిన లాభాన్ని సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు, ప్రైవేట్ వ్యాపారులు పంచుకుంటున్నారు. మార్కెట్ కు వెళ్లేందుకు ఖర్చులెందుకని భావించిన రైతులు గ్రామాల్లో చిల్లర వ్యాపారులకు రూ.6 వేలకు పత్తిని అమ్ముకుంటున్నారు. కొందరు జిన్నింగ్ మిల్లుల యజమానులు ఏజెంట్లను పంపిం చి రైతుల ఇండ్ల వద్ద పత్తి కొనుగోలు చేసి మిల్లుల్లోని కేంద్రాల్లో  సీసీఐకి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. 

కొందరికే జెండా పాటను పాడుతూ.. 

మిర్చి పంటలోనూ రైతులు అలానే మోసపోతున్నారు. క్రమంగా రేటు తగ్గించుకుంటూ వస్తున్న వ్యాపారులు, జెండా పాటను కొందరు రైతులకే పరిమితం చేసి అగ్గువ రేటుకే మిగిలిన రైతుల పంటను కొంటున్నారు. పేరుకే రూ.18 వేలు జెండా పాటగా చెబుతున్నా, యావరేజీగా రైతులకు క్వింటాకు రూ.15 వేలు కూడా దక్కడం లేదు. 

క్వింటా రూ.1900కే అమ్ముకున్నా 

సొంత భూమి  2 ఎకరాలు, మరో ఎకరం కౌలు తీసుకుని పండించిన 100 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. నాలుగు రోజులైతున్నా కొనడం లేదు. ఒకవైపు వాన భయం , మరోవైపు రోజుల తరబడి కాపలా ఉండలేక రూ.1900కే ప్రైవేట్ వ్యాపారికి అమ్ముకున్నా. కనీస మద్దతు ధర కూడా రాలేదు. 

బుర్రి శ్రీనివాసరావు, పుల్లయ్య బంజర, కల్లూరు మండలం