- సుప్రీంను కోరిన బ్రాడ్‌కాస్టర్లు
కోల్‌కతా: బొకేలలోని చానెళ్ల ధరలను ఈ ఏడాది డిసెంబరు నుంచి రూ.12కు పరిమితం చేయాలంటూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలను టీవీ చానెల్ బ్రాడ్‌కాస్టర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ధరలను పెంచాలని కోరారు. ఈ మేరకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫెడరేషన్ (ఐబీడీఎఫ్) పిటిషన్ వేసింది. పాపులర్ ఛానెళ్లను ప్యాకేజీల నుండి తొలగించవద్దని, ఇప్పుడున్న ధరలను 30 శాతం- నుంచి 50 శాతం దాకా పెంచాలని రిక్వెస్ట్ చేసింది. దీనిపై ఈ నెలాఖరులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఐబీడీఎఫ్ ప్రతిపాదనను ఆమోదిస్తే, వచ్చే నెల నుండి నెలవారీ కేబుల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ధర దాదాపు 50 శాతం పెరగవచ్చు. స్టార్ & డిస్నీ ఇండియా, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, వయాకామ్ 18తో సహా కొందరు బ్రాడ్‌కాస్టర్లు తమ ఫ్లాగ్‌షిప్ ఛానెళ్లను బొకేల నుంచి తొలగించాయి. వాటి ధరలను రూ.15 రూ.30 మధ్య వరకు పెంచాయి. ధరల పెంపు వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని లోకల్ కేబుల్ ఆపరేటర్లు భయపడుతున్నారు.“రెండు సంవత్సరాల క్రితమే ఛానెల్ ధరలు దాదాపు 40శాతం పెరిగాయి. దీంతో కోల్‌కతా వంటి నగరాల్లో కనెక్షన్లు బాగా తగ్గాయి. ఈసారి మరో 25శాతం నుంచి -30శాతం పెంపును ప్రపోజ్ చేశారు. దీనివల్ల సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు 50 శాతం- నుంచి 60 శాతం పెరుగుతాయి” అని ఆల్ బెంగాల్ కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ల జాయింట్ కన్వీనర్ తపస్ దాస్ అన్నారు. బ్రాడ్‌కాస్టర్లకు అనుకూలంగా తీర్పు వస్తే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్‌మెంట్, సినిమా ఛానెల్‌ల ధరలు ఇక నుంచి రూ.15 నుండి రూ.30 వరకు ఉంటాయి.
