పెళ్లి కొడుకు ఐసోలేషన్.. గెస్ట్ లంతా క్వారెంటైన్

పెళ్లి కొడుకు ఐసోలేషన్.. గెస్ట్ లంతా క్వారెంటైన్

కర్నూలు: ప్రస్తుత కరోనా కాలంలో చిన్నపాటి నిర్లక్ష్యం అనేక కష్టాల పాలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకున్నా.. కాస్త తొందరపాటు పెళ్లి వేడుక ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితికి దారితీసింది. చివరకు పసుపు బట్టలతో పెళ్లి కొడుకును అంబులెన్స్ లో ఐసో లేషన్ కు.. పెళ్లి కూతురు సహా బంధువులందరినీ క్వారెంటైన్ చేయాల్సి వచ్చింది. వేడుకతో సంబంధం లేకున్నా గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో..  గ్రామంలోని 70 కుటుంబాల వారు 14 రోజులపాటు ఊరువిడిచి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని  కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్.తండా గ్రామంలో జరిగిందీ సంఘటన.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమాను తండా గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇదే జిల్లాలోని వెల్దుర్తి మండలం ఎల్.బండ తండా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల 10న పెళ్లిగా నిర్ణయించుకుని పెళ్లికొడుకు తరపు నుండి 25 మంది గ్రామానికి వచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి తంతు ముగిసింది. రిసెప్షన్ రోజు రాత్రి ఉల్లాసంగా విందు చేసుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకుకు అస్వస్థతకు గురయ్యాడు. హైదరాబాద్ నుండి వచ్చిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడంతో.. అస్వస్థతకు గురైన పెళ్లి కొడుకుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా కరోనా రిపోర్టు వచ్చింది. పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం వేడుకలో అందరినీ షాక్ కు గురిచేసింది. రిసెప్షన్ లో పసుపు బట్టలతో అస్వస్థతకు గురైన పెళ్లి కొడుకును వెల్దుర్తి నుండి వచ్చిన అంబులెన్స్ లో వచ్చిన వైద్య సిబ్బంది ఐసోలేషన్ కు తరలించారు. అందరూ సహ పంక్తి భోజనాలు చేసినట్లు తెలియడంతో.. పెళ్లి కూతురు సహా పెళ్లికి హాజరైన ఇరువైపులా బంధువులందరినీ  హోం క్వారెంటైన్ చేశారు. పెళ్లి వేడుక సందర్భంగా ఇరవైపులా బంధువులు అందరూ గ్రామంలో కలివిడిగా తిరిగినట్లు గుర్తించిన అధికారులు మొత్తం గ్రామాన్నంతటినీ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. దీంతో గ్రామస్తులందరూ ఏ ఒక్కరూ ఊరు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితికి దారితీసింది.